Begin typing your search above and press return to search.

లెక్క త‌క్కువ‌కాకుండా చూస్తున్న బాబు

By:  Tupaki Desk   |   23 Aug 2016 9:30 AM GMT
లెక్క  త‌క్కువ‌కాకుండా చూస్తున్న బాబు
X
తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పోటీ ప‌డి నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఒలింపిక్స్‌ విజేత సింధూకు అవార్డు ద‌క్కినందుకు ఇచ్చే అవార్డుల విష‌యంలో మాత్ర‌మే అనుకునేరు. ప‌రిపాల‌న ప‌ర‌మైన విష‌యాల్లోనూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు- తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య సారుప్య‌తతో కూడిన పోటీ క‌నిపిస్తోంది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలోనూ తెర‌మీద‌కు వ‌చ్చిన వార్త‌లు దీన్ని నిజం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటును దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు సార‌థ్యంలో జిల్లాల విభ‌జ‌న జ‌ర‌గ‌నుంద‌ని వినిపిస్తోంది.

తెలంగాణ‌లో పది జిల్లాలను 27 జిల్లాలుగా విభ‌జిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లే ఏపీలో 36 జిల్లాల‌ను ఏర్పాటుచేసేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. తొమ్మిది అనే ల‌క్కీనెంబ‌రుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా 27 జిల్లాల‌ను ఏర్పాటుచేసిన కేసీఆర్ దారిలోనే బాబు న‌డుస్తార‌ని చెప్తున్నారు. 36ను కూడితే 9 వ‌స్తున్న నేప‌థ్యంలో ఇదే సంఖ్య‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తార‌ని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా బాబు నిర్ణ‌యం వెనుక రాజ‌కీయ కార‌ణం కూడా ఉంద‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వల్ల అనేక‌మంది వైసీపీ నేత‌లు సైకిలెక్కిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పున‌ర్విభ‌జ‌న‌పై వారు ఆశ‌ప‌డ్డ‌ప్ప‌టికీ అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌క‌పోవ‌డంతో జిల్లాల పున‌ర్విభ‌జ‌న ద్వారా వారికి ఉప‌శ‌మ‌నం కలిగిస్తార‌ని అంటున్నారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ స‌హా ఉండే ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టి కొత్త నేత‌ల‌కు రాజ‌కీయ ప‌ద‌వుల సంతృప్తి క‌లిగించే కోణంలో బాబు నిర్ణ‌యం ఉండ‌వ‌చ్చని చెప్తున్నారు.