Begin typing your search above and press return to search.

వాళ్లు ఏపీ పోలీసులు కాదంట

By:  Tupaki Desk   |   17 March 2015 10:23 AM GMT
వాళ్లు ఏపీ పోలీసులు కాదంట
X
ఏపీ అంగన్‌వాడీల చలో అసెంబ్లీ కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. వందలాదిగా అంగన్‌వాడీలు అనూహ్యంగా ఇందిరాపార్కుకు చేరుకొని..అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈసందర్భంగా తోపులాట.. ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై అంగన్‌వాడీలు ఏపీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా తమ పట్ల దారుణంగా వ్యవహరించారని వారు వాపోతున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి కొట్టించటంలో సక్సెస్‌ అయిన సీపీఐ నేత నారాయణ.. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం అనుసరించిన కర్కసత్వాన్ని తీవ్రంగా ఖండించి.. దొంగ కన్నీరు కార్చారు.

ఏపీ నుంచి వచ్చిన అంగన్‌వాడీలకు అవగాహన ఉండదు కానీ.. నారాయణ లాంటి నేతలకు హైదరాబాద్‌ శాంతిభద్రతలన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంటాయని.. అక్కడి పోలీసులు వ్యవహరించే వైఖరి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నది తెలుసు. కానీ.. రాజకీయ ప్రయోజనాలు తప్పించి..ఏపీ నుంచి తీసుకొచ్చిన అంగన్‌వాడీల సంక్షేమం పట్టని కమ్యూనిస్టు నాయకులు వారుతిప్పలు పడేటట్లు వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంగన్‌వాడీల పట్ల పోలీసుల అనుసరించిన విధానంపై సమాచారం అందుకున్న ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విస్పష్ట ప్రకటన చేశారు. అంగన్‌ వాడీల సమస్యలపై తాను సానుకూలంగా స్పందిస్తానని.. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా కొంత ఇబ్బంది ఉందని.. అయినప్పటికీ వారి సమస్యలపట్ల పాజిటివ్‌ గా రియాక్ట్‌ అవుతానని చెప్పారు.

అదేసమయంలో హైదరాబాద్‌ శాంతిభద్రతలు ఏపీ ప్రభుత్వం చేతిలో ఉండవని.. హైదరాబాద్‌ పోలీసింగ్‌ మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంటుందని.. అందుకే హైదరాబాద్‌లో పోలీసులు వ్యవహరించే వైఖరికి ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉండదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన చెప్పుకొచ్చారు. అయినా.. దెబ్బ తగిలిన వాడికి నొప్పి.. బాధ తప్పించి.. ఏ రాష్ట్ర పోలీసు కొట్టాడన్న విషయం పట్టించుకుంటారా? విషయం ఇంత వరకూ రాకుండా బాబు జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.