Begin typing your search above and press return to search.

డిమాండ్లు చేసి...సున్నితంగా ప్ర‌తిపాదించిన బాబు

By:  Tupaki Desk   |   8 Sep 2016 12:57 PM GMT
డిమాండ్లు చేసి...సున్నితంగా ప్ర‌తిపాదించిన బాబు
X
కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని ప‌క్క‌నపెట్టి ప్యాకేజీ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా వివ‌ర‌ణ ఇచ్చారు. ఏపీ శాస‌న‌స‌మండ‌లిలో హోదా గురించి మాట్లాడిన చంద్ర‌బాబు ఒకింత ఆవేశంగా ప్ర‌సంగిస్తూనే అదే స‌మ‌యంలో త‌న‌ను తాను త‌మాయించుకున్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని - కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న‌ అర్థరాత్రి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన హామీల అమలుకు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని చంద్రబాబు నాయుడు శాసనమండలి వేదికగా కోరారు. విభజన అవమానాలకు గురైన ప్రజల్లో ప్రత్యేక హోదా చుట్టూ బలమైన ఆకాంక్ష నెలకొందన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేలా కేంద్రం సహకరించాలని కోరారు. అందుకే జైట్లీ ఇచ్చిన హామీల అమలుకు కాలపరిమితితో కూడిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతున్నానని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ ను ప్ర‌త్య‌క్షంగా - ప‌రోక్షంగా సీఎం చంద్ర‌బాబు త‌ప్పుప‌ట్టారు. ఏ విష‌యంలోనూ ఇచ్చే వివ‌ర‌ణ‌ను వినేందుకు ప్ర‌తిప‌క్షం సిద్ధంగా లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వాజ్‌ పేయి హ‌యాంలోనే త‌మ‌కు పెద్ద సంఖ్య‌లో ఎంపీలు ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర మంత్రి ప‌ద‌వులు తీసుకోలేద‌ని, ఇపుడు కూడా ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని అన్నారు. అయితే ప్ర‌తిదానికి రాజీనామాలు కోర‌డం స‌రైంది కాద‌ని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్‌ చేసిన పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును కొంతమంది వ్యతిరేకించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే నేడు పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎందరో రైతులు లాభపడుతున్నారని ఆయన అన్నారు. 2018నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని ఆయన చెప్పారు. పోలవరానికి 25 నుంచి 30 వేల కోట్ల రూపాయిలు ఖర్చయ్యే అవకాశాలున్నాయన్నారు. ఈ మొత్తం ఖర్చును కేంద్రం భరిస్తుందని జైట్లీ చెప్పారని బాబు వివ‌రించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని ఏపీ సీఎం కోరారు. ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ.2500 కోట్లు ఇచ్చిందని వివరించారు. మరో వెయ్యి కోట్లు విడుదలకు ప్రతిపాదించారని తెలిపారు.

రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనమండలిలో మాట్లాడుతున్న ఆయన.. రాయలసీమలో వచ్చే ఏడాదికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. రాయలసీమలో పంటలను కాపాడుకునేందుకు రెయిన్‌ గన్‌ లు వినియోగిస్తున్నామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.300 కోట్లు ఇస్తోందని, ఇంకా ఇవ్వాలని కోరుతున్నామని వివరించారు. విశాఖపట్నానికి రైల్వేజోన్‌ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాసనమండలి వేదికగా కేంద్రాన్ని కోరారు.