Begin typing your search above and press return to search.

లోకేశ్ భూదందాకు నిలువెత్తు సాక్ష్యాలివిగో!

By:  Tupaki Desk   |   29 March 2017 4:59 AM GMT
లోకేశ్ భూదందాకు నిలువెత్తు సాక్ష్యాలివిగో!
X
సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలో అధికార టీడీపీ నేత‌లు భూదందాకు పాల్ప‌డుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. విప‌క్షం వైసీపీతో పాటు వామ‌ప‌క్షాలు కూడా ఈ భూదందాపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. ఏపీ శాస‌న‌మండ‌లిలో కొత్త స‌భ్యుడిగా ఎన్నికైన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఈ భూదందాకు తెర తీశార‌ని కూడా ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ఆరోప‌ణ‌లను ఖండిస్తున్న బాబు అండ్ కో... ఏపీ వాణిజ్య రాజ‌ధానిగా ఎదుగుతున్న విశాఖ‌లో తాము ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం లేద‌ని చెబుతూ వ‌స్తోంది. అయితే టీడీపీ నేత‌లు చేస్తున్న వాద‌న సాంతం త‌ప్పేనంటూ... అక్క‌డ అధికార పార్టీ నేత‌ల భూదందాకు త‌న వ‌ద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయ‌ని ఆ పార్టీ మిత్ర‌ప‌క్షం బీజేపీ నేత‌, ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అది కూడా వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీ సాక్షిగా రాజు చేసిన ఆరోప‌ణ‌లు టీడీపీలో వ‌ణుకు పుట్టించాయ‌నే చెప్పాలి.

విశాఖ‌లో అధికార పార్టీ నేత‌లు, రాజ‌కీయంగా బ‌లంగా ఉన్న నేత‌లు భూదందాకు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా భూదందాకు పాల్ప‌డుతున్న వారిలో మంత్రులు కూడా ఉన్నార‌ని కూడా రాజు చెప్పుకొచ్చారు. టీడీపీ నేత‌లు చేస్తున్న భూదందాపై తాను పోరాటం మొద‌లుపెట్టాన‌ని చెప్పిన రాజు... భూదందాను నిల‌దీసిన కార‌ణంగా త‌న‌ను చంపేస్తామ‌ని కూడా బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏకంగా లారీల‌తో గుద్దించి చంపేస్తామ‌ని భూదందారాయుళ్ల నుంచి వ‌చ్చిన బెదిరింపుల‌తో తాను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాన‌ని ఆయ‌న చెప్పారు. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడిన సంద‌ర్భంగా రాజు... ఈ భూదందాకు సంబంధించి చాలా వివ‌రాలే చెప్పేశారు.

*విశాఖ‌లో అక్ర‌మాలు పెరిగాయి. మంత్రులు కూడా ఈ భూదందాల్లో ఉన్నారు. జీవో రాకుండానే రైతుల నుంచి భూముల‌ను లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ భూదందా విలువ మొత్తం రూ.2,400 కోట్లు. బ‌డా రాజ‌కీయ నేత‌లే భూదందాకు పాల్ప‌డుతున్నారు. దీనిపై ప్ర‌శ్నించిన న‌న్ను చంపుతామంటూ బెదిరిస్తున్నారు. వాహ‌నంతో గుద్ది మ‌రీ చంపుతామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయి. దీనిపై హౌస్ క‌మిటీ, సీబీఐ, సీబీసీఐడీతో విచార‌ణ చేయించాలి* అని రాజు ఈ భూదందాకు సంబంధించి పెద్ద చిట్టానే విప్పారు. మంత్రులు, బ‌డా రాజ‌కీయ నేత‌లు అన్న మాట రాజు నోట నుంచి రాగానే... ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసిపోయింది. దీంతో ఉన్న‌ప‌ళంగా మీడియా పాయింట్ వ‌ద్ద ఉన్న రాజుకు సీఎం నుంచి పిలుపు వ‌చ్చిందట‌. అంతే... మీడియాతో మాట్లాడే వ్య‌వ‌హారం పూర్తి కాకుండానే రాజు సీఎం వ‌ద్ద‌కు వెళ్లిపోయారు.

రాజుతో సుదీర్ఘంగా చ‌ర్చించిన సీఎం... ఏదైనా విష‌యం ఉంటే మిత్ర‌ప‌క్షంగా ముందుగా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని, ఇలా మీడియా ముందు నోరు విప్పితే ఇద్ద‌రికీ న‌ష్ట‌మేన‌ని చెప్పార‌ట‌. అయితే త‌న‌ను చంపేస్తామంటే కూడా నోరు విప్ప‌కుండా ఎలా ఉంటానంటూ రాజు కూడా కాస్తంత గ‌ట్టిగానే వాదించార‌ని స‌మాచారం. దీంతో స‌ర్దుకున్న చంద్ర‌బాబు... విశాఖ‌లో భూదందాకు సంబంధించి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేయిస్తాన‌ని రాజుకు హామీ ఇచ్చార‌ట‌. ఇదే విష‌యాన్ని మీడియాకు చెప్పాల‌ని కూడా రాజును సీఎం కోరార‌ట‌. దీంతో చంద్ర‌బాబు గ‌ది నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాజు... మ‌ళ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి... విశాఖ భూదందాపై విచార‌ణ చేయిస్తాని సీఎం హామీ ఇచ్చార‌ని చెప్పారు. అంతేకాకుండా... ఈ విష‌యంపై త‌న‌తో సీఎం చ‌ర్చించిన విష‌యాన్ని కూడా రాజు వివ‌రించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/