Begin typing your search above and press return to search.

ఈ ఇష్యూలో బాబుది మొనగాడి నిర్ణయమా?

By:  Tupaki Desk   |   5 April 2016 11:30 AM GMT
ఈ ఇష్యూలో బాబుది మొనగాడి నిర్ణయమా?
X
తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకోవటంలో బాబు మరీ స్లో అయిపోతున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్న సమయంలో.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్నారని చెబుతున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అమలులో ఉన్న విధానానికి భిన్నంగా.. స్థానిక సంస్థల అధిపతుల్ని ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని చట్టబద్ధం చేయాలన్న ఆలోచనను చంద్రబాబు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన సీరియస్ గా ఉండటమేకాదు.. ఈ తరహా రాజకీయాల వల్ల అనవసరమైన లొల్లి తగ్గుతుందన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ పంచాయితీ.. మున్సిపాలిటీ.. నగరపాలక సంస్థల అధిపతులుగా.. సర్పంచ్.. ఛైర్మన్.. మేయర్ పదవుల్ని.. ఎన్నికైన వార్డు సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవటం తెలిసిందే. ఈ కారణంగా.. రాజకీయంగా చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా.. ఈ పదవులు మారిపోవటం తెలిసిందే. స్వార్థ రాజకీయాలకు అవకాశం ఇస్తున్న ఇప్పటి విధానం స్థానంలో అందుకు భిన్నంగా.. ప్రజలే ఎన్నుకున్న నాయకుడు పాలన చేసేలా చేస్తే బాగుంటుందన్న భావన బాబులో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందుకోసం 73 - 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్రం తీసుకొచ్చిన మార్పుల్ని.. చట్ట ప్రకారం మార్పులు చేస్తే.. ఎన్నికల ప్రక్రియ మార్పు చోటు చేసుకుంటుందని చెబుతున్నారు. ప్రత్యక్ష విధానం అమలైతే.. తాయిలాలకు.. ప్రలోభాలకు లొంగేలా చేయటం.. తమ అవసరానికి తగ్గట్లుగా రాజకీయాల్ని మార్చుకునే వీలు అధికారపక్షానికి కలిగించేలా ప్రస్తుత విధానం ఉంది.

నిజానికి స్థానిక సంస్థల అధినేతల్ని ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం గతంలోనే తెలుగుదేశం సర్కారు అమలు చేసింది. అయితే.. తర్వాత వచ్చిన వైఎస్ ఆ విధానాన్ని మార్చేసి.. పరోక్ష పద్ధతిలో అధిపతుల్ని ఎన్నుకునేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ విధానం వల్ల అభివృద్ధి విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు స్థానిక సంస్థల అధినేతలకు అవకాశం ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు వీలుగా.. గతంలో అనుసరించిన ప్రత్యక్ష విధానాన్ని త్వరలోజరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.