Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎందుకలా చేశారు?

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:30 AM GMT
చంద్రబాబు ఎందుకలా చేశారు?
X
కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష సుఖాంతమైంది. అయితే.... ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ పరిశీలిస్తే మాత్రం చంద్రబాబు తప్పటడుగులే ఇంతవరకు తెచ్చాయా అన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు కూడా మొండివైఖరితో ఉండడం వల్లే ఈ వివాదం బిగుసుకుందని... లేదంటే చర్చలతో పరిష్కరామయ్యేదని అంటున్నారు.

కాపు ఐక్య గర్జనను అడ్డుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారన్నది గర్జన నాయకుల తొలి ఆరోపణ. గర్జనకు జనం రాకుండా, నేతలు రాకుండా చంద్రబాబు చేశారన్నది అందరి నుంచి వినిపిస్తున్న బహిరంగ ఆరోపణ. ఆ తరువాత గర్జనలో విధ్వంసం జరిగాక మాత్రం చంద్రబాబు కొంత తగ్గారు... అయితే.. ముద్రగడ దీక్షకు కూర్చున్నాక చంద్రబాబులో డిక్టేటర్ నిద్రలేచాడు. ముద్రగడతో చర్చించే అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. అంతేకాదు... ముందస్తు జాగ్రత్తల పేరుతో కిర్లంపూడిని పోలీసులతో నింపేశారు. కర్ఫ్యూ అన్న పదం ఒక్కటి వాడలేదు కానీ అక్కడ కర్ఫూ వాతావరణం సృష్టించారు.

ముఖ్యంగా ముద్రగడను కలిసేందుకు వచ్చే నాయకులను అడ్డుకోవడం చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది. సోమవారం ఉదయం దాసరి - చిరంజీవి - రఘువీరాలను రాజమండ్రి లో అడ్డుకుని అక్కడి నుంచి కదలనివ్వలేదు. ఇంతకుముందు కూడా వీహెచ్ - వట్టి వసంతకుమార్ వంటి నేతలనూ అడ్డుకుంటే వారు ధర్నాలు చేసి ముద్రగడను కలిశారు. ఇవన్నీ ముద్రగడ మరింత బిగుసుకునేలా చేశాయి. చంద్రబాబు కాపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్న అనుమానం కలిగించాయి. అణచివేత ఉన్నప్పుడు దానికి కౌంటర్ కూడా అదే స్థాయిలో ఉంటుందన్న సత్యాన్ని చంద్రబాబు మర్చిపోయారు. ఇక్కడ అదే జరిగింది. జనాన్ని ఎంతగా కంట్రోల్ చేస్తుంటే వారు అంతగా ముద్రగడకు మద్దతు నిలవడం ప్రారంభించారు. పైగా చంద్రబాబు తన చర్యలతో కాపు వ్యతిరేక ముద్ర వేయించుకున్నారు.

కాపులకు స్పష్టమైన హామీని తాను ఇచ్చినా ఎందుకిలా దీక్ష చేస్తున్నారన్నది చంద్రబాబు వాదన. కానీ.. ప్రజలు మరోసారి హామీ కోరుకుంటున్నారన్న విషయాన్ని ఆయన గుర్తించలేదు. దీంతో చివరకు టీడీపీలో కాపు నేతలు, ఇతర ముఖ్యులు చంద్రబాబును ఒప్పించడంతో మూడు స్పష్టమైన హామీలతో ముద్రగడ వద్దకు ఆయన రాయబారులను పంపించారు. అవి ముద్రగడకు నచ్చడం... చంద్రబాబుపై నమ్మకం కలగడంతో ఆయన దీక్ష విరమించి రాష్ట్రంలో ఉద్రిక్తతలను తొలగించారు. ఈ పనేదో చంద్రబాబు ముందే చేస్తే ఇంతవరకు వచ్చేదే కాదు.