Begin typing your search above and press return to search.

బాబును ఇరికించపోయి ఇరుకున్న కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   27 July 2016 5:47 AM GMT
బాబును ఇరికించపోయి ఇరుకున్న కాంగ్రెస్‌
X
ఏపీ ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చకొచ్చిన ప్రైవేటు బిల్లు టీడీపీకే రాజకీయ అనుకూలత తెచ్చినట్లుగా అనిపిస్తోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీకే చెందిన సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఈ బిల్లును పెట్టిన సంగతి తెలిసిందే. అయితే బిల్లుపై చర్చ సందర్భంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వాస్తవానికి ఈ బిల్లు ద్వారా బీజేపీతో పాటు టీడీపీని కూడా ఇరుకునపెట్టాలని కేవీపీ ప్రయత్నించారు. కానీ... అనూహ్యంగా ఈ బిల్లుకు రాజ్యసభలో ఎలాంటి మద్దతు దక్కలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ బిల్లును సీరియస్ గా తీసుకోలేదు. మరోవైపు బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ - కేంద్ర మంత్రి సుజనా చౌదరిలు తమ పార్టీ వాయిస్ ను బలంగా వినిపించగలిగారు. దీంతో రాజ్యసభ వేదికగా టీడీపీ వాదన వినిపించేందుకు కేవీపీ బిల్లు అవకాశమిచ్చినట్లయింది.

రాజ్యసభలో ప్రత్యేక హోదాపై మాట్లాడే అవకాశం రావడం టీడీపీకి పనికొచ్చింది. మిత్రపక్ష బిజెపిపై కాలు దువ్వేందుకు తెలుగుదేశం భయపడుతోందంటూ ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో తమ వైఖరి - చిత్తశుద్ధి ఏంటో చెప్పే అవకాశం టీడీపీకి దక్కింది. అదేసమయంలో అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ కు చెందిన సభ్యుడే రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడుతూ హోదా కోసం ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం ఇప్పటికే పలు విమర్శలకు దారితీసింది. పైగా ఈ బిల్లుకు రాజ్యసభలోని కాంగ్రెస్‌ సభ్యుల నుంచి మద్దతు లభించలేదు. అధిష్టానం కూడా దీనిపై చూసీచూడనట్లు వ్యవహరించింది. గత శుక్రవారం బిల్లుపై చర్చ జరగాల్సి ఉండగా ఇంకో అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగలదిగా చేపట్టి రాజ్యసభను అర్ధాంతరంగా వాయిదా వేశారు.

పైగా కాంగ్రెస్ లోనూ చాలామంది సీనియర్ నేతలు ఈ బిల్లు వెనుక కేవీపీ వ్యక్తిగత ప్రయోజనాలు - వ్యూహాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలంగా లేకపోయినా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఆ పార్టీకి ముఖ్యమైన ఫేస్ గా ప్రొజెక్టు చేసుకునేందుకు కేవీపీ ఈ ఎత్తుగడ వేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ సభ్యులు దీనిపై పెద్దగా స్పందించలేదు. అదేసమయంలో ఈ చర్చ ద్వారా తెలుగుదేశం ఇటు కాంగ్రెస్‌ అటు బిజెపి రెండింటికి స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మిత్రపక్షమన్న బేధభావాలు చూపే పరిస్తితిలేదంటూ బీజేపీకి సంకేతాలివ్వడంతో పాటు ప్రత్యేక హోదాపై ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో కేవీపీ బిల్లు గమ్యం లేని నావలా మారి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏమీ సాధించలేకపోయింది.