Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్‌ కి ఇచ్చిన స‌ల‌హా చెప్పిన బాబు..?

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:31 AM GMT
వాజ్ పేయ్‌ కి ఇచ్చిన స‌ల‌హా చెప్పిన బాబు..?
X
నోరు తెరిచి బాబు మాట్లాడ‌టం మొద‌లెడితే చాలు భ‌లే స‌ర‌దాగా ఉంటుంది. ఎందుకంటే.. ఆయ‌న మాట‌ల్లో వ‌చ్చే కొత్త అంశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం దాచిపెట్టుకోవాల‌న్న విష‌యాన్ని ఆయ‌న మాట‌లు అదే ప‌నిగా గుర్తు చేస్తుంటాయి. తానెంత గొప్పొణ్ని అన్న విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోవ‌టానికి బాబు ఏ రోజు వెనుకాడ‌రు.

అయినా.. ఎవ‌రో వ‌చ్చి గుర్తించే క‌న్నా.. ఎవ‌రికి వారు త‌మ త‌మ గొప్ప‌ల్ని చెప్పేసుకుంటే మంచిది క‌దా అన్న కాన్సెప్ట్ బాబులో క‌నిపిస్తుంటుంది. అందుకే మ‌న‌సులోకి వచ్చిన ఏ మాట‌నైనా ఆయ‌న చెప్పేస్తుంటారు. ఎవ‌రేం అనుకుంటే నాకేంటి..? నేను చెప్పాల్సింది చెప్పేస్తున్నా అన్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది. తాజాగా అలాంటి విష‌యాన్ని చెప్పిన చంద్ర‌బాబు మాటేమిటంటే.. దేశ ప్ర‌ధానులుగా ప‌ని చేసిన వారిలో దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకున్న కొంద‌రిలో వాజ్ పేయ్ ఒక‌రు. అలాంటి పెద్ద‌మనిషికి చంద్ర‌బాబు అప్ప‌ట్లో ఒక‌స‌ల‌హా ఇచ్చార‌ట‌.

న‌దుల సంధానం చేయాల‌ని తాను వాజ్ పేయ్‌ కు అప్పుడెప్పుడో చెబితే ఇప్పుడు కార్య‌రూపం దాల్చిన‌ట్లుగా చెప్పారు. అసెంబ్లీలో ప‌ట్టిసీమ‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. త‌న గొప్ప‌త‌నాన్ని అంద‌రికి చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

తానిచ్చిన న‌దుల సంధానం కార్య‌క్ర‌మాన్ని తాను చేప‌ట్టి ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయ‌టంతో క‌లిగిన లాభాన్ని గొప్ప‌గా చెప్పుకొచ్చారు. ప‌ట్టిసీమ‌ను పూర్తి చేయ‌కుంటే అసెంబ్లీలో కూర్చోగ‌లిగే వాళ్లం కాద‌ని.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చేదంటూ చెప్పుకున్నారు.

ప‌ట్టిసీమ‌ను పూర్తి చేయ‌టంతో కృష్ణా డెల్టా రైతులు పంట‌లు పండించుకోగ‌లిగార‌ని.. సీమ‌కు సైతం ప‌ట్టిసీమ ప్రాజెక్టు కార‌ణంగా తాగునీరు అందించిన‌ట్లుగా చంద్ర‌బాబు చెప్పుకున్నారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు అవ‌స‌రాల కోసం చేప‌ట్టిన భూసేక‌ర‌ణ‌కు రూ.822 కోట్లు ప‌రిహారం చెల్లించిన‌ట్లుగా చెప్పిన చంద్ర‌బాబు.. గ‌డిచిన రెండేళ్ల వ్య‌వ‌ధిలో రూ.30వేల కోట్ల విలువైన పంట‌లు ప‌ట్టిసీమ ప్రాజెక్టు ద్వారా చేతికి వ‌చ్చిన‌ట్లుగా చెప్పుకున్నారు. మొత్తానికి ప‌ట్టిసీమ కార‌ణంగా ఎంత లాభం జ‌రిగింద‌న్న విష‌యంతో పాటు.. వాజ్ పేయ్ లాంటి మేధావుల‌కు సైతం స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చిన స‌త్తా త‌న సొంత‌మ‌న్న విష‌యాన్ని బాబు త‌న తాజా మాట‌ల్లో చెప్పాకొచ్చారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టుపై కేంద్ర‌మంత్రి చేసిన పొగ‌డ్త‌ను తాజాగా ప్ర‌స్తావించిన వైనం చూస్తే.. ప‌ట్టిసీమ అద్భుత‌మైన ప్రాజెక్టు అన్న‌బిల్డ‌ప్ చంద్ర‌బాబులో క‌నిపించ‌క మాన‌దు.