Begin typing your search above and press return to search.

మరీ అంత అత్యాశేంటి చంద్రబాబు..?

By:  Tupaki Desk   |   18 Feb 2017 5:07 AM GMT
మరీ అంత అత్యాశేంటి చంద్రబాబు..?
X
ఆశ తప్పేం కాదు. అదే మనిషిని నడిపిస్తుంది. అలా అని అత్యాశ అస్సలు పనికి రాదు. ఎవరి దాకానో ఎందుకు.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడండి. ఆయన తెలంగాణలో ఎంతటి బలమైన నాయకుడో.. ఆయన ప్రభుత్వం ఎంత బలంగా ఉందో చూసినంతనే అర్థమవుతుంది. కేసీఆర్ కు మరో సానుకూలాంశం ఏమిటంటే.. ఆయన తర్వాత ఎవరు? అనే విషయంపై స్పష్టత ఉంది. వారి సామర్థ్యం ఎంతటిది? అన్న దానిపైనా క్లారిటీ ఉంది. ఇన్ని ఉన్నా.. కేసీఆర్ నోట ఎప్పుడూ.. తమ పార్టీనే అధికారంలో శాశ్వితంగా ఉంటుందన్న మాట అస్సలు రాదు.

కొన్ని మాటల్ని వీలైనంతవరకూ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే.. ఆచితూచి మాట్లాడాలి.కానీ.. ఇలాంటి విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాజిక్ మిస్ అవుతారు. తన మాటలకు ప్రజలు ఏమనుకుంటారన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. తనకు నచ్చినట్లుగా మాట్లాడేస్తుంటారు. తన మాటలు ప్రజల వద్దకు నెగిటివ్ గా వెళ్లే అవకాశంతో పాటు.. మరీ ఇంత అత్యాశ అన్నట్లుగా ఫీల్ అవుతారన్న కనీసం స్పృహ లేని తీరు కనిపిస్తుంది.

చరిత్రను చూస్తే.. సమస్త భూమండలాన్ని శాసించాలన్న కోరిక ఇప్పటి వరకూ ఏ వ్యక్తికి సాధ్యం కాలేదు. కాదు కూడా. అది సాధ్యమయ్యే అవకాశమే లేదు. అదే సమయంలో.. తాము మాత్రమే పవర్ లో ఉండాలి. మరెవరూ ఆ దరిదాపుల్లోకి రాకూడదన్న ఫీలింగ్ కూడా సరైంది కాదు. నిజానికి.. ప్రాక్టికల్ గా ఆలోచించే ఏ అధినేత నోటి నుంచి కూడా ఈ తరహా మాటలు రావు.కానీ.. చంద్రబాబు మాత్రం ఇలాంటి మాటల్ని అలవోకగా మాట్లాడేస్తుంటారు.

ఏపీలో టీడీపీ శాశ్వితంగా పవర్ లో ఉండేలా చూడాలని.. ఎందుకంటే.. తన కోసం కాకున్నా.. ప్రజల సంక్షేమం కోసమైనా ఆ పని చేయాలన్న మాటను చెబుతున్నారు చంద్రబాబు. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీతో సమన్వయం చేసుకోకుండా.. ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారని.. ఇది మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిన దానికే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరు నేపథ్యంలో ఏపీలో పార్టీనే శాశ్వితంగా పవర్ లో ఉండాలన్న ఆశ.. అత్యాశే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. శాశ్వితంగా పవర్ లోనే పార్టీ ఉండాలన్న మాటలు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయన్న విషయాన్ని బాబుకు ఎవరు చెబుతారు. పవర్ తలకు ఎక్కేసిన వేళ వచ్చే మాటలు ఎలా ఉంటాయన్నది చెప్పాలంటే.. బాబు స్టేట్ మెంట్లను ఇచ్చేస్తే సరిపోతుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/