Begin typing your search above and press return to search.
బాబు సర్వే మాట!.. గోపీలకు గడ్డుకాలమే!
By: Tupaki Desk | 28 Jan 2018 3:30 PM GMTఇంకో ఏడాది ఉంటే... 2019 ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు నేలకు చెందిన రెండు రాష్ట్రాలు,. మరో ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పక్షంలో ఈ 8 రాష్ట్రాలు కూడా ముందస్తు ఎన్నికలకే వెళ్లక తప్పని పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. అంటే ముందస్తు అయినా, కాకపోయినా... ఇంకో ఏడాది తర్వాత ఎన్నికలు జరిగి తీరడం ఖాయమేనన్న మాట. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు అంతకంతకూ ఆసక్తికరంగా మారుతున్నా... తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా... మరోమారు పాలనా పగ్గాలు చేపట్టేందుకు ఆ పార్టీ అధినేత. సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పక్కా వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇందులో భాగంగా రెండు జాతీయ సర్వే సంస్థలను పిలిపించి... రాష్ట్రంలో తమ పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్తు ఏమిటి? ఏఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం? ఏఏ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నాం? గెలిచేవారెంతమంది? ఓడేవారెంత మంది? ఓడే అవకాశాలున్న స్థానాల్లో సిట్టింగులను మారిస్తే ఏమైనా ఫలితముంటుందా? అలా మార్పుచేర్పులు చేస్తే... ఎలాంటి ఫలితాలు వస్తాయి? అన్న విషయాలపై సమగ్ర సర్వే చేయించుకున్నారట.
ఈ రెండు సర్వేలు కూడా 2019లోనూ చంద్రబాబుదే అధికారమని తేల్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతైనా బాబు నియమించుకున్న సంస్థలు... బాబు ఓడిపోతారని ఎలా చెబుతాయి చెప్పండి. సరే అది వదిలేస్తే... సదరు సర్వేలు పలు ఆసక్తికర అంశాలను చంద్రబాబు ముందు పెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం, చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లకముందే ఈ సర్వేలు ఆయన ముందుకు రాగా... సదరు నివేదికలు చూసి బాబు నిజంగానే షాక్ తిన్నారట. ఎందుకంటే గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్లపై బరిలోకి దిగి... తన పార్టీ అభ్యర్థులను ఓడించిన వారిలో 22 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట బాబు తన పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత కేబినెట్ షఫిలింగ్ లో ఆ 22 మందిలో నలుగురికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేశారు. అంతేనా ఆ నలుగురికి కూడా కీలక శాఖల బాధ్యతలనే చంద్రబాబు అప్పగించారు. ఇదంతా బాగానే ఉన్నా... చంద్రబాబు ముందుకు వచ్చిన సర్వే నివేదకలు ఓ అంశాన్ని చంద్రబాబుకు ముక్కుసూటిగానే చెప్పేశాయట. టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోయి పార్టీలు మారిన 22 మందిలో చాలా మంది వరకు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలే లేవట.
ఎందుకంటే... గడచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన కారణంగానే సదరు నేతలకు ఓట్లేశామని, అయితే వారు తమ విశ్వాసాన్ని గంగలో కలిపేసి... పార్టీ ఫిరాయించేసి ఇప్పుడు టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగితే ఎలా ఆదరిస్తామని వారికి ఓట్లేసిన ప్రజలే నిర్భయంగానే ప్రశ్నించేశారట. ఓడిపోయే అవకాశాలున్న నేతలకు ఈ దఫా టికెట్లిచ్చేది లేదని చెబుతున్న చంద్రబాబు... గెలిపించిన నేతకు నమ్మక ద్రోహం చేసి, తనను నమ్మి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకపోతే ఎలాగంటూ అంతర్మథనంలో కూరుకుపోయారట. సొంతంగా చేయించుకున్న సర్వేలోనే ఈ తరహా నిజాలు బయటపడితే.. స్వతంత్ర సంస్థలు చేసే సర్వేల్లో ఇంకెన్ని నిజాలు బయటపడతాయోనని చంద్రబాబు అయోమయంలో పడిపోయారట. అయినా సర్వేల మాట అటుంచితే... ఓడిపోయే నేతలకు టికెట్లు ఇవ్వనని చెబుతున్న తాను... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒట్టి చేతులు ఎలా చూపాలన్న రీతిలో నిజంగానే అమోయమంలో పడిపోయారట. మొత్తానికి సొంతంగా చేయించుకున్న సర్వేలే బాబును డైలమాలో పడేశాయన్న మాట.