Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు నెత్తిన పాలు పోసిన రాహుల్!

By:  Tupaki Desk   |   23 July 2018 1:30 PM GMT
చంద్ర‌బాబు నెత్తిన పాలు పోసిన రాహుల్!
X
రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌లు ఊస‌ర‌వెల్లుల్లా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ పార్టీపై దుమ్మెత్తిపోసిన వారే....అదే పార్టీలోకి జంప్ చేసి కీల‌క‌మైన ప‌ద‌వులు చేప‌ట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇపుడు ఏపీలో కూడా ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు జోరందుకున్నాయి. 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌కు....రాబోయే ఎన్నిక‌ల్లో `ఏపీకి ప్ర‌త్యేక హోదా` అంశం ట్రంప్ కార్డ్ గా మారిన నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర పొత్తులు తెర‌పైకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. హోదా ఇవ్వ‌ని బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న టీడీపీ కొత్త పొత్తు కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హోదా ఇస్తే...ఏ పార్టీతోనైనా క‌లిసేందుకు సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, 2019లో తాము అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ సీడ‌బ్ల్యూసీలో రాహుల్ గాంధీ తీర్మానించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే కాంగ్రెస్ తో టీడీపీ జ‌త‌క‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

హోదాపై మాట మార్చిన‌ బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. దీంతో, ఎక్క‌డ పోగొట్టుకున్నామో అక్క‌డే వెతుక్కోవాల‌న్న‌ట్లు కాంగ్రెస్ ....ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఏపీని విభ‌జించి ఆంధ్రా ప్ర‌జ‌ల ఉసురుపోసుకున్న కాంగ్రెస్....గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో, ఈసారి ఆ తప్పును స‌రిదిద్దుకొని....కేంద్రంలో అధికారం చేప‌ట్టి పూర్వ‌వైభ‌వాన్ని సొంతం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అందుకే రాబోయే ఎన్నిక‌ల్లో గెలిస్తే...హోదా ఇస్తామ‌ని రాహుల్ ఏకంగీ సీడ‌బ్ల్యూసీలో తీర్మానం కూడా చేశారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకునేందుకు ఏదో ఒక వంక కోసం ఎదురుచూస్తోన్న చంద్ర‌బాబుకు....ఈ తీర్మానం వ‌జ్రాయుధ‌మైంది.

కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టేందుకు బ‌ల‌మైన కారణాన్ని రాహుల్ స్వ‌యంగా చంద్రబాబుకు ఇచ్చేశారు. హోదా కోస‌మే ఈ పొత్తుకు అంగీక‌రించాన‌ని, రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారని పుకార్లు వ‌స్తున్నాయి. సైద్ధాంతిక‌ప‌రంగా చాలా వైరుధ్యం ఉన్నప్ప‌టికీ....కేవ‌లం ప్ర‌జ‌ల కోస‌మే పొత్తు అని సంకేతాలిచ్చేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. అదీగాక‌, ఒంటరిగా వెళితే....అధికారం ద‌క్క‌దేమోన‌న్న అనుమానాలు చంద్ర‌బాబుకు ఉన్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. అందుకే, రాహుల్ ఇచ్చిన అవ‌కాశాన్ని బాబు అందిపుచ్చుకునేందుకు రెడీగా ఉన్నార‌ని టాక్. ఓ ర‌కంగా, చంద్ర‌బాబు నెత్తిన రాహుల్ పాలు పోసినట్ల‌యింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధికార‌మే ప‌రమావ‌ధిగా ముందుకు వెళుతోన్న ఈ రెండు పార్టీలు...`హోదా`ను ట్రంప్ కార్డ్ లా వాడుకుంటాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.