Begin typing your search above and press return to search.

జ‌మిలిపై బాబు తిప్పిన మాట‌ల‌కు సాక్ష్యాలివే..!

By:  Tupaki Desk   |   11 July 2018 6:15 AM GMT
జ‌మిలిపై బాబు తిప్పిన మాట‌ల‌కు సాక్ష్యాలివే..!
X
ఊస‌రవెల్లి రంగులు మారుస్తుంది. ఇది లోకం మొత్తానికి తెలిసిన విష‌యం. అదే రీతిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌లు తిప్ప‌టంలో మొన‌గాడు. తాను చెప్పిన మాట‌కు సంబంధం లేకుండా అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నానికి స‌రిపోయేలా ఎప్ప‌టిక‌ప్పుడు మాట మార్చేయ‌టం.. అదేమ‌న్నా అంటే పిడి వాద‌న‌ను వినిపించ‌టంలో బాబు త‌ర్వాతే ఎవ‌రైనా.

ఏపీకి ప్రాణ‌వాయువు లాంటి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న మార్చిన మాట‌ల ముచ్చ‌ట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తొలుత ప్ర‌త్యేక హోదా కావాలంటూనే.. త‌ర్వాతి కాలంలో హోదా ఎందుకు ప్యాకేజీ ఉండ‌గా అంటూ మాట తిప్పేశారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. మోడీతో రిలేష‌న్ దెబ్బ తిన్న త‌ర్వాత మాట మార్చేసిన ఆయ‌న‌.. ప్ర‌త్యేక హోదా మీద గ‌ళం విప్ప‌టం షురూ చేశారు. ఇలా అవ‌స‌రానికో మాట‌ను మాట్లాడ‌టం బాబుకు చేత‌నైనంత బాగా మ‌రెవ‌రికీ చేత‌కాద‌నే చెప్పాలి.

తాజాగా జ‌మిలి ఎన్నిక‌ల మీద బాబు మాట కూడా మారింది. గతంలో జ‌మిలి ఎన్నిక‌లు కావాలంటూ వాద‌న‌ను వినిపించిన బాబు.. తాజాగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌మిలికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. జ‌మిలిపై బాబు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు పొంత‌న లేని రీతిలో తాజాగా వాద‌న‌ను వినిపించ‌టం.. లా క‌మిష‌న్ కు నివేదిక ఇవ్వ‌టం చూస్తే.. విష‌యం ఏదైనా స‌రే.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా మార్చేయ‌టం క‌నిపించ‌క మాన‌దు.

జ‌మిలిపై బాబు మార్చిన మాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 2017 అక్టోబ‌రు 5న ఒక జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను మొద‌ట్నించి జ‌మిలి ఎన్నిక‌ల్ని కోరుకుంటున్న‌ట్లుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం. త‌న వాద‌న‌కు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తూ త‌న పార్టీ నేత‌ల చేత లా క‌మిష‌న్ కు నివేదిక ఇచ్చిన టీడీపీ అధినేత వైఖ‌రిని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం 2018 సెప్టెంబ‌రు త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది క‌దా? మ‌రి ఎన్డీయే భాగ‌స్వామిగా మీ మాటేమిటి అన్న ప్ర‌శ్న‌కు అప్ప‌ట్లో స‌మాధానం ఇచ్చిన చంద్ర‌బాబు.. తాను మొద‌ట్నించి జ‌మిలి ఎన్నిక‌లు కోరుకుంటున్న‌ట్లుగా చెప్పారు. లోక్ స‌భ‌కు.. అసెంబ్లీకి.. స్థానిక సంస్థ‌ల‌కు కూడా ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని.. ఆర్నెల్ల లోపు లేదంటే గ‌రిష్ఠంగా 9 నెల‌ల‌లోపు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ముగించి.. మిగిలిన స‌మ‌యం పాల‌న మీద దృష్టి పెట్టాల‌న్నారు. ఎన్నిక‌ల వ్య‌యం.. అవినీతిని త‌గ్గించేందుకు జ‌మిలి సాయం చేస్తుంద‌న్న మాట బాబు నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

ఇందుకు భిన్నంగా ఇప్పుడేమో జమిలి ఎన్నిక‌లు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీస్తాయంటూ బాబు వాద‌న‌ను వినిపించటం గ‌మ‌నార్హం. రాష్ట్ర అసెంబ్లీ కాల ప‌రిమితి ముగియ‌కుండానే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపించారు. జ‌మిలిపై చంద్ర‌బాబు తీసుకున్న యూటర్న్ ల‌ను చూస్తే..

27-04-2017న సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

"దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను నేను స్వాగతిస్తున్నా. మూడు నెలలకు - ఆర్నెల్ల‌కు ఎన్నికలు ఏమిటి? ‘ఒక దేశం– ఒక ఎన్నిక ’ అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనను బలపరుస్తున్నా"

05-10-2017న ఒక ఇంగ్లిష్ టీవీ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు

"లోక్‌ సభ - అసెంబ్లీ - స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మొదటి నుంచి కోరుకుంటున్నా. ఒకేసారి అన్ని ఎన్నికలు అయిపోతే మిగిలిన సమయమంతా ప్రభుత్వ విధానాల రూపకల్పన - వాటి అమలుపై పూర్తిగా దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఇది మంచిది"

09-07-2018న చంద్రబాబు ఆదేశాలపై లా కమిషన్‌ కు టీడీపీ ఎంపీలు ఇచ్చిన లేఖ సారాంశం

"పార్లమెంటుకు - అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరదు. రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి ముగియకముందే పార్లమెంటుతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలనడం రాజ్యాంగ విరుద్ధం. దీనికి టీడీపీ వ్యతిరేకం"