Begin typing your search above and press return to search.
బాబు మాట!... మా డీజీపీ - మా ఇష్టం!
By: Tupaki Desk | 17 Dec 2017 7:06 AM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు నిజంగానే ఆసక్తికరంగా ఉంటోంది. కేంద్రంలో తమ మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉన్నా కూడా... బాబు అనుకున్న మేర కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం రావడం లేదు. దీనిపై చాలా కాలమే వెయిట్ అండ్ సీ ధోరణిని అవలంబించిన చంద్రబాబు... ఇక ఇలాగే వెళితే పని కాదనుకున్నారో - ఏమో తెలియదు గానీ... ఇటీవలి కాలంలో పంథా మార్చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కూడా కాలు దువ్వేందుకు వెనుకాడేది లేదన్న కోణంలో బాబు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్రం ఇదివరకు కూడా నాన్చుడు ధోరణిని వ్యవహరించినా... అప్పుడు ఎందుకనో గానీ చంద్రబాబు ధిక్కార స్వరాన్ని వినిపించలేదు. అయితే తన జీవితాశయం గా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వేస్తున్న బ్రేకులు ఆయనకు నిజంగానే కోపం తెప్పించాయనే చెప్పాలి.
వచ్చే ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది చంద్రబాబు సంకల్పం. అయితే నిధుల విడుదలలో తీవ్ర జాప్యంతో పాటుగా ప్రాజెక్టులో కీలక నిర్మాణంగా పరిగణిస్తున్న కాఫర్ డ్యాం పనులను నిలిపివేయాలంటూ కేంద్రం ఆడేశాలతో భగ్గుమన్న చంద్రబాబు... ప్రాజెక్టు ఆలస్యమైతే... తప్పు తనది కాదని, కేంద్రానిదేనని చెప్పేందుకు పక్కా వ్యూహం రచించుకొన్నారు. దీంతో దెబ్బకు దిగివచ్చిన కేంద్రం... పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం వైఖరి పట్ల ఇదే వైఖరిని కొనసాగించాల్సిందేనని తీర్మానించుకున్న చంద్రబాబు... ఇప్పుడు ఏపీ డీజీపీ నియామకం వ్యవహారంలోనూ ఇదే స్పీడుతో ముందుకు సాగుతున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రమైనా పాలనలో కీలకంగా వ్యవహరించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - రాష్ట్ర డీజీపీ నియామకం విషయంలో కేంద్రం మార్గదర్శకాలను అమలు చేసి తీరాల్సిందే. సదరు పోస్టులకు అర్హత ఉన్న ముగ్గురేసి అధికారుల జాబితాను పంపి... ఆ జాబితా నుంచి కేంద్రం ఎంపిక చేసిన ఆఫీసర్ నే ఆ పోస్టులో నియమించాల్సి ఉంది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది ఇదే.
అయితే ఇప్పుడు ఏపీ డీజీపీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నండూరి సాంబశివరావు విషయంలో బాబు సర్కారు కేంద్రంతో ఢీకొట్టేందుకు రెడీ అయిపోయింది. ఈ నెలాఖరు నాటికి నండూరి పదవీ కాలం పూర్తి కానుంది. ఆ తర్వాత కొత్త డీజీపీగా ఎవరిని నియమించాలన్న విషయంపై కేంద్రాన్ని సంప్రదించిన బాబు సర్కారు... ముగ్గురు అధికారులకు బదులుగా ఆరుగురు అధికారులతో కూడిన జాబితాను పంపింది. అయితే ఈ జాబితా సరికాదంటూ కేంద్రం తిప్పి పంపినా... రెండో దఫా కూడా అదే జాబితాను పంపుతూ... తమ వద్ద ఇంతకంటే మంచి ప్రతిపాదన ఏదీ లేదని కూడా తేల్చి చెప్పింది. ఈ క్రమంలో బాబు సర్కారు తన మాట వినటం లేదని గ్రహించిన కేంద్రం... ఏకంగా డీజీపీ ఎంపిక ప్యానెల్ కమిటీ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో మరింతగా భగ్గుమన్న చంద్రబాబు... మా డీజీపీ - మా ఇష్టం.. ఈ విషయంలో మీ పెత్తనమేమిటంటూ కొత్త వాదనను అందుకున్నారు. అనుకున్నదే తడవుగా మా డీజీపీని మేమే నియమించుకుంటామంటూ... అందుకు తగ్గట్లుగా నిబంధనలను కూడా మార్చేసేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న పోలీస్ యాక్ట్-2014కు కొన్ని సవరణలు చేసేసి పోలీస్ యాక్ట్-2017 పేరిట కొత్త చట్టం రూపకల్పనకు శ్రీకారం చుట్టేశారు.
ఇప్పటికే రూపొందిన ఈ ప్రతిపాదిత ముసాయిదాకు చంద్రబాబు కేబినెట్ నిన్నటి భేటీలో ఆమోద ముద్ర వేసేసింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రానికి ఉంటుంది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను ఎంపిక చేసుకొని అందులోంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ కొత్త చట్టానికి కేంద్రం ఏ మేరకు అంగీకరిస్తుంది? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వినిపిస్తోది. ఏదేమైనా డీజీపీ నియామకం వ్యవహారంలో కేంద్రం మాట వినేది లేదని నిర్ణయించుకున్న మీదటే చంద్రబాబు ఈ సరికొత్త అడుగు వేసినట్లుగా భావిస్తున్నారు. మరి ఈ కొత్త చట్ట రూపకల్పన బాబు - కేంద్రం మధ్య సంబంధాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.