Begin typing your search above and press return to search.

ఇదెక్కడి రాజకీయం? చంద్రయ్యను హత్య చేసే వేళలో ఆ కేకలా?

By:  Tupaki Desk   |   14 Jan 2022 7:51 AM GMT
ఇదెక్కడి రాజకీయం? చంద్రయ్యను హత్య చేసే వేళలో ఆ కేకలా?
X
తెలుగుదేశం పార్టీ నేత చంద్రయ్య దారుణ హత్య జరిగింది. అది కూడా.. గురువారం ఉదయం.. అందరూ చూస్తుండగా వైసీపీకి చెందిన పలువురు ఆయన్ను కత్తులతో పొడిచి.. బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ దారుణ హత్యకు కారణం ఫ్యాక్షన్ కానీ.. చంపుకునేంత వివాదాలు లేవు. ఆస్తి తగదాలు అసలే లేవు. అయినా.. హత్య జరిగింది.. అది కూడా ఊళ్లో తెలుగుదేశం పార్టీ చురుగ్గా ఉండటం.. ఊళ్లో టీడీపీ జెండా పట్టుకునేంత మగాడివి అయ్యావా? అంటూ చంపేసిన వైనం గురించి విన్నప్పుడు ఏపీలో ఇప్పుడెలాంటి రాజకీయం ఉందన్న భావన కలుగక మానదు.

తన తండ్రిని తన కళ్ల ముందే చంపిన వైనాన్ని చంద్రయ్య కుమారుడు వివరిస్తున్నాడు. ఇంతకూ హత్యకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఇది కూడా ఒక కారణమా? అన్న భావన కలుగక మానదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు తగ్గాయి. పార్టీ తరఫున పని చేసే వారిపై కేసులు బుక్ కావటంతో.. ఇప్పుడెందుకీ రాజకీయం అంటూ ఎవరికి వారు గమ్మున ఉంటున్నారు. ఇలాంటివేళ.. నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించారు.

ఇన్ చార్జి హోదాలో డిసెంబరు 29న తొలిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు.. పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికితే.. ఆ కార్యక్రమంలో హైలెట్ అయ్యింది గుండ్ల పాడు గ్రామం నుంచి చంద్రయ్య భారీగా జన సమీకరణ జరిపారు. ఇదే ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది.

ఇక.. గురువారం ఉదయం జరిగిన దారుణ హత్య గురించి ప్రత్యక్ష సాక్ష్యులు.. హతుడు చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన తీరు.. హత్య చేస్తున్న వేళ.. హత్యకు పాల్పడిన వారు వేసిన కేకలు.. అరుపులు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. పోలీసులకు తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ఇచ్చిన కంప్లైంట్ లో ఏముందంటే..

‘‘నేను గుంటూరులో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సంక్రాంతి సెలవులకు బుధవారం ఊరికి వచ్చాను. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తున్నా. మా నాన్న అదే సమయంలో సత్రం వైపు నుంచి వస్తున్నారు. ఊరికి చెందిన వైసీపీ నేతలు ఎంపీపీ చింతా శివరామయ్య.. చింతా ఆదినారాయణ.. తోట ఆంజనేయులు.. మాజీ ఎంపీపీ తోట శివ నారాయణ.. సాని రఘురామయ్య.. సాని కోటేశ్వరరావు.. చింతా యల్లమంద కోటయ్య.. చింతా శ్రీనివాసరావు నాన్న మీద కత్తులతో దాడి చేశారు. బూతులు తిడుతూ.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరుగుతావా? టీడీపీ జెండా పట్టుకొని ఎవరు తిరుగుతారో చూస్తామంటూ విచక్షణ రహితంగా పొడిచారు’’

‘‘ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి.. ఆయన సోదరుడు వెంటక్రామిరెడ్డికి ఎదురు నిలబడే మగాళ్లా? అంటూ శివరామయ్య.. ఆదినారాయణ అరుస్తూ.. దారుణంగా దాడి చేసి చంపేశారు నేను.. మా పిన్ని వారిని అడ్డుకునేందుకు వెళితే.. తోసేశారు. నాన్న ప్రాణాలు పోయాయని నిర్దారించుకున్న తర్వాత హత్య చేసిన వారంతా కండ్లకుంట వైపు పారిపోయారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మా ఊరికి వచ్చి.. శివరామయ్య.. ఆదినారాయణ.. ఆంజనేయులతో మాట్లాడి వెళ్లారు. మర్నాడు ఉదయమే మా నాన్న హత్య జరిగింది’’ అని పేర్కొన్నాడు.

హత్య జరిగిన తీరును స్థానికులు వివరిస్తూ.. ‘‘ఉదయం టూ వీలర్ మీద ఊరి శివారుకు వెళ్లి.. అక్కడ ట్రాక్టర్ తో మట్టి తోలకం పని అప్పగించి.. తిరిగి వెళుతూ.. ఊరి సెంటర్ లో టీ తాగారు. ఇంటికి బయలుదేరారు. టీ కొట్టు నుంచి ఇంటికి రెండు నిమిషాలే టైం పడుతుంది. కానీ.. అక్కడున్న అరుగుల మీద కూర్చున్న ముగ్గురు వ్యక్తులు.. బైక్ మీ వెళుతున్న నాన్నను తొలుత నాటుకర్రతో గట్టిగా కొట్టారు.

కిందిపడిపోయాక కత్తులతో పొడిచారు. నాపరాళ్లతో మోదారు. అదే సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తున్న చంద్రయ్య కొడుకు వీరాంజనేయులు అక్కడికి పరుగు మీద వచ్చి.. మా నాన్నను చంపొద్దని ప్రాధేయపడ్డాడు. చంపొద్దని వేడుకున్నా.. ప్రత్యర్థులు కనికరించలేదు.. వీరాంజనేయులు.. అతడి పిన్నిని పక్కకు లాగేసి.. వైసీపీని ధిక్కరించే దమ్ముందా?ఊర్లో టీడీపీని నడిపించేంత మగాడివా? అంటూ కత్తులతో పొడిచారు. పట్టపగలు.. కళ్ల ముందు ఇంత దారుణం జరుగుతున్నా.. స్థానికులు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు’’ అని పేర్కొన్నారు.

గ్రామంలో రాజకీయ అధిపత్యం కోసం తోట చంద్రయ్యను చంపినట్లే.. 18 ఏళ్ల క్రితం కూడా మరో హత్య జరిగింది. అప్పుడు కూడా టీడీపీ కార్యకర్తనే బలి తీసుకోవటం గమనార్హం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి కక్షసాధింపు చర్యలు మొదలైనట్లుగా చెబుతున్నారు. తప్పుడు కేసులు పెట్టటం.. స్టేషన్ కు పిలిపించటం.. బెదిరించటం లాంటివి చేయటంతో టీడీపీ కార్యకర్తలు పార్టీ వ్యవహారాలకుదూరంగా ఉంటున్నారు. బ్రహ్మారెడ్డిని నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. దాన్ని తగ్గించే క్రమంలోనే.. ఈ హత్య జరిగినట్లుగా చెబుతున్నారు.