Begin typing your search above and press return to search.

ఎక్కువైంది కదూ?; టార్గెట్ 2050.. టార్గెట్ 99

By:  Tupaki Desk   |   30 May 2016 7:32 AM GMT
ఎక్కువైంది కదూ?; టార్గెట్ 2050.. టార్గెట్ 99
X
ఒకే వేదిక మీద రెండు టార్గెట్లు. రెండు వేర్వేరు అంశాల మీద మూడు రోజల పాటు సాగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పెట్టుకున్న లక్ష్యాలు విన్నప్పుడు ఒకింత షాక్ కలిగించటం ఖాయం. ఎందుకంటే.. లక్ష్యం అన్నది లక్ష్యసాధనకు సాధ్యమయ్యేదిగా ఉండాలే కానీ అసాధ్యంగా ఉండకూడదు. కానీ.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తానన్న పట్టుదల ఏమో కానీ.. ఎవరు చేరుకోలేని భారీ లక్ష్యాన్నే తెలుగు తమ్ముళ్ల ముందు పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన పెట్టిన లక్ష్యం చూసి.. తాను మాత్రం తక్కువ తిన్నానా? అంటూ తెలంగాణ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి సైతం చెలరేగిపోయి.. తనకు తాను మరో లక్ష్యాన్ని ప్రకటించేశారు. తొలుత చంద్రబాబు లక్ష్యమైన ‘‘టార్గెట్ 2050’’ చూద్దాం. ప్రస్తుతం మనం 2016లో ఉన్నాం. బాబు ఏమో 2050 గురించి మాట్లాడారు. అంటే.. 34 ఏళ్ల స్వప్నాన్ని ఆయన తాజా మహానాడులో ఆవిష్కరించారన్న మాట. ఆయన టార్గెట్ ప్రకారం 2022 నాటికి ఏపీని దేశంలో మూడు ఆగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా చేయటం.. 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా ఏపీని నిలపటం.. 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని నిలపటం. మరింత భారీ స్వప్నం సాకారం కావాలంటే ఏం చేయాలి?

చేతిలో అధికారం ఉండాలి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం కూడా అదే. రానున్న 34 ఏళ్ల పాటు తమ పార్టీ అధికారంలో ఉండాలన్నదే ఆయన ఆశ.. ఆకాంక్ష. నాన్ స్టాప్ గా.. 34 ఏళ్లు అంటే.. 2019 ఎన్నికలతో మొదలు పెడితే దాదాపు మరో ఆరు టర్మ్ లు పవర్ లోకి రావాలన్నది బాబు లక్ష్యంగా చెప్పాలి. నిజానికి ఇలాంటివి సాధ్యమా? అంటే.. అవునన్న మాటను ఎవరూ చెప్పలేనిది. సింఫుల్ లాజిక్ చూసుకున్నా.. ప్రస్తుతం బాబు వయసు 66 ఏళ్లు. ఆయన తాజా స్వప్నం మరో 34 ఏళ్లు. అంటే.. 2050 నాటికి బాబు వయసు వందేళ్లలో ఉంటారు. తొంభై ప్లస్ లో ఉన్న కరుణానిధి పరిస్థితి ఇప్పుడెలా ఉందో చూస్తున్నదే. మరి.. వందేళ్ల వయసు నాటికి బాబు మాటేమిటన్నది ఒక ప్రశ్న.

బాబు తర్వాత.. అంత సమర్థత ఉన్న నాయకులు తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ వెంటనే సమాధానం చెప్పటం కష్టం. వారసత్వ రాజకీయాల్లో భాగంగా లోకేశ్ ను బాబు వారసుడిగా అనుకుంటున్నది తెలిసిందే. మరి.. ఆయనలో అంత సత్తా ఉందా? అన్న విషయం ఇప్పటివరకూ అయితే ప్రూవ్ కాలేదు. భవిష్యత్తులో అవుతుందా? అన్నది ఒక ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ 2050 అన్నది అత్యాశ కాదా? అన్నది ఒక డౌట్.

పార్టీ అధినేత చంద్రబాబు టార్గెట్ గురించి ముందే తెలిసి.. అలాంటి అతిశయోక్తి లాంటి టార్గెట్ ను ఒకటి తనకు తానుగా వెల్లడించారు తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి. ఆయన టార్గెట్ 99అంటూ.. 2019న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో 99 స్థానాలు చేజిక్కించుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 119. ఇందులో 99 స్థానాల్లో పార్టీ విజయం సాధించటం అంటే.. దాదాపు 83 శాతం సీట్లను టీడీపీ సొంతం చేసుకోవాలి.

సరే.. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఇదేమీ అసాధ్యమైన లక్ష్యం కాదని అనుకోవచ్చు. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉందో అందరికి తెలిసిందే. రోజు రోజుకీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత బలోపేతం అవుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితే చూస్తే.. ఇప్పుడు ఆ పార్టీలో మిగిలిన తెలంగాణ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. ఆపరేషన్ ఆకర్ష్ తర్వాత మిగిలింది ముగ్గురే. ఆ ముగ్గురిలోనూ ఆర్ కృష్ణయ్య తన దారిన తాను ఉంటున్నారే కానీ పార్టీ కార్యక్రమాల్లో అస్సలు పాలు పంచుకోవటం లేదు. అంటే..వాస్తవ దృష్టిలో లెక్కిస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు అక్షరాల ఇద్దరు మాత్రమేనన్న మాట.

ఎమ్మెల్యేల సంగతి తర్వాత.. పార్టీ క్యాడర్ ఉన్నా పార్టీని ఏదోలా బతికించుకోవచ్చు. కానీ.. తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు కనుమరుగైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడేళ్ల వ్యవధిలో పార్టీకి 99 అసెంబ్లీ స్థానాలు సాధించటం లక్ష్యంగా పెట్టుకోవటం చూస్తే.. షాక్ తినాల్సిందే. లక్ష్యాలు సాధించేవిగా ఉండాలే కానీ.. అందుకు భిన్నంగా ఉంటే మాటలుగానే మిగిలిపోతాయన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు గుర్తిస్తే బాగుంటుందేమో..?