Begin typing your search above and press return to search.

టార్గెట్‌ విషయంలో బాబు కు పట్టువిడుపుండాలి!

By:  Tupaki Desk   |   6 Nov 2015 4:13 AM GMT
టార్గెట్‌ విషయంలో బాబు కు పట్టువిడుపుండాలి!
X
తాను కలగన్న పనులన్నీ తెల్లారేలోగా పూర్తయిపోవాలంటే.. వాటిని చేసే వారి చేతిలో అల్లావుద్దీన్‌ అద్భుతదీపం ఏమీ ఉండదు కదా..! ఎలాంటి పనిచేయాలన్నా దానికి నిర్దిష్టంగా ఎంతో కొంత సమయం పడుతుంది. అయితే దానికి కాగల సమయానికంటె ముందు అర్జంటుగా పూర్తయిపోవాలని తొందరపెడితే గనుక.. మహా అయితే పని కాస్త అవకతవకగా అవుతుంది. లేదా పనిలో నాణ్యత చెడిపోతుంది. ఆ వాస్తవాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. తాను విజయవాడకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ అర్జంటుగా చక్కబడిపోవాలని ఆయనకు కోరిక ఉండచ్చు. కానీ పనులునెమ్మదిగా జరుగుతాయని ఆయన వేచిచూడాలి.

ఇప్పుడు దుర్గ గుడి వద్ద ఎన్నాళ్లనుంచో సంకల్పిస్తున్న ఫ్లై ఓవర్‌ పనులు ఇప్పుడు ప్రారంభం కానున్నాయి. దీనిని సోమ సంస్థ కాంట్రాక్టు తీసుకున్న తరువాత.. తాజాగా 4.8 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది. అంతవరకూ అంతా బాగానే ఉంది. విజయవాడ వాసులకు ఎన్నాళ్లుగానో ఉన్న ట్రాఫిక్‌ సమస్యకు ఈ ఫ్లై ఓవర్‌ ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది.

అయితే ఇప్పుడు పనులు ప్రారంభం కాబోతుండగా.. కృష్ణా పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేసేయాలని చంద్రబాబునాయుడు టార్గెట్లు డిసైడ్‌చేస్తున్నారు. రోజుకు 18 గంటలు పనిచేయడం చంద్రబాబునాయుడుకు అలవాటే కావచ్చు. కానీ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు అలా జరిగే అవకాశం ఉండదు. కృష్ణా పుష్కరాలంటే వచ్చే ఏడాది గోదావరి అంత్యపుష్కరాలు అయిన వెంటనే జులై, ఆగస్టు నెలల్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఏడెనిమిది నెలల్లో ఒక ఫ్లై ఓవర్‌ ను నిర్మించడం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసాధ్యం అనే అంతా అంటున్నారు. అందుకే ఫ్లై ఓవర్‌ పనుల టార్గెట్‌ విషయంలో సీఎంకు పట్టువిడుపు ఉండాలని అంటున్నారు.