Begin typing your search above and press return to search.

బాబు చివరి భేటీ!.. మోదీపై దండ‌యాత్రే!

By:  Tupaki Desk   |   14 May 2019 2:56 PM GMT
బాబు చివరి భేటీ!.. మోదీపై దండ‌యాత్రే!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు... త‌న ఐదేళ్ల పాల‌న‌లో భాగంగా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ చివ‌రి కేబినెట్ బేటీని ముగించేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా కేబినెట్ భేటీ నిర్వ‌హిస్తానని, త‌న‌ను ఎవ‌రు అడ్డుకుంటారో చూస్తానంటూ చంద్ర‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఏకంగా యుద్ధాన్నే ప్ర‌క‌టించేసిన సంగ‌తి తెలిసిందే క‌దా. అయితే ఆ యుద్ధాన్ని ప‌క్క‌న‌పెట్టేసి... తుఫాను వ‌చ్చింది - తాగు నీటి స‌మ‌స్యా ఉంది - క‌రువు తాండ‌విస్తోంది... కేబినెట్ భేటీకి అనుమ‌తివ్వండి మ‌హాప్ర‌భో అంటూ ఈసీకి లేఖ రాసిన చంద్ర‌బాబు... ఎట్ల‌కేల‌కు అనుమ‌తి సాధించారు. అయితే ఈ అనుమ‌తి రావ‌డానికి కాస్తంత టైమ్ పట్టగా... 10న కేబినెట్ భేటీ అన్న చంద్ర‌బాబు... దానిని 14వ తేదీకి మార్చుకున్నారు.

అప్ప‌టిదాకా అనుమ‌తి వస్తుందో - రాదోన‌న్న బెంగ‌తో సాగిన చంద్ర‌బాబు.. అనుమ‌తి రాగానే నిజంగానే ఖుషీ అయ్యార‌నే చెప్పాలి. స‌రే... ఈ సీ అనుమ‌తి తీసుకుని నేటి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేబినెట్ భేటీని మొద‌లెట్టిన చంద్ర‌బాబు... రెండు గంట‌ల పాటు భేటీని నిర్వ‌హించారు. తాను నేరుగానే టార్గెట్ చేసిన సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం స‌మ‌క్షంలోనే చంద్ర‌బాబు కేబినెట్ భేటీని నిర్వ‌హించ‌క త‌ప్ప‌లేదు. ఈ భేటీలో ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండానే పాటించిన చంద్ర‌బాబు... నిర్దేశిత అజెండాలు అయిన ఫ‌ణి తుఫాను, క‌రువు, తాగునీటి ఎద్ద‌డి మీద‌నే చ‌ర్చించారు. బీజేపీతో మైత్రిని తెంచేసుకున్న త‌ర్వాత వేదిక ఏదైనా - సంద‌ర్భం ఏదైనా కూడా మోదీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు... త‌న చివ‌రి కేబినెట్ భేటీలోనూ అదే పంథాను కొన‌సాగించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

క‌రువు, ఫ‌ణి తుఫాను సాయంలో ఏపీ ప‌ట్ల మోదీ స‌ర్కారు క‌క్ష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రించింద‌ని ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు అండ్ కో... ఈ విష‌యాల్లో ఏపీకి కేంద్రం ఏకంగా రూ.1400 కోట్ల మేర బాకీ ప‌డింద‌ని తేల్చేశారు. ఈ నిధుల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కూడా ఈ భేటీలో బాబు కేబినెట్ తీర్మానం చేసింది. కేబినెట్ భేటీ ముగిసిన త‌ర్వాత ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశ‌మేమీ పెట్ట‌ని బాబు స‌ర్కారు... వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ ఇవే విషయాల‌ను వ‌ల్లె వేశారు. మొత్తంగా చివ‌రి కేబినెట్ భేటీలోనూ మోదీ స‌ర్కారుపై కొన‌సాగిస్తున్న యుద్ధాన్ని బాబు కొన‌సాగించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే... బాబు చివ‌రి కేబినెట్ భేటీకి ఆయ‌న కేబినెట్ లోని మంత్రులు చాలా మంది హాజ‌ర‌య్యారు. అయితే ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు - పితాని స‌త్య‌నారాయ‌ణ‌ - సుజ‌య‌కృష్ణ రంగారావు - ఎన్ ఎండీ ఫ‌రూక్ లు ఈ భేటీకి గైర్హాజ‌ర‌య్యారు. మిగిలిన మంత్రులంతా ఉత్సాహంగానే ఈ భేటీకి వ‌చ్చినా.. గ‌తంలో మాదిరిగా వారి ముఖాల్లో జోష్ మాత్రం క‌నిపించ‌లేదు. గ‌తంలో వ్య‌క్తిగ‌త సిబ్బందితో క‌లిసి కేబినెట్ భేటీల‌కు హాజ‌రైన మంత్రులు.. కోడ్ నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌త సిబ్బంది లేకుండానే భేటీకి వ‌చ్చారు. ఇక కేబినెట్ భేటీల సంద‌ర్భంగా స‌చివాల‌యంలో క‌నిపించే జోష్ కూడా మ‌చ్చుకు కూడా క‌నిపించ‌లేదు. మంత్రుల వెంట భారీ ఎత్తున స‌చివాల‌యానికి వ‌చ్చే వారి అనుచ‌ర గ‌ణం ఇప్పుడు క‌నిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెప్పుకోవాలి.