Begin typing your search above and press return to search.

అసంతృప్త త‌మ్ముళ్ల‌ను ఎలా కంట్రోల్ చేశారంటే

By:  Tupaki Desk   |   4 April 2017 5:48 AM GMT
అసంతృప్త త‌మ్ముళ్ల‌ను ఎలా కంట్రోల్ చేశారంటే
X
మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కాస్తా ఊహించ‌ని రీతిలో అసంతృప్త జ్వాల‌లు ఎగిసిప‌డ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప‌ద‌వులు రాని వారు.. ఆగ్ర‌హంతో విరుచుకుప‌డిన వైనాన్ని కంట్రోల్ చేసేందుకు విభ‌జించు పాలించు సూత్రాన్ని అమ‌లు చేశారు. అసంతృప్త నేత‌ల్ని కంట్రోల్ చేసేందుకు విధేయ నేత‌ల్ని రంగంలోకి దించారు చంద్ర‌బాబు. సోమ‌వారం ఉద‌యం నుంచి వ‌రుస‌గా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో కొంద‌రు వెన‌క్కి త‌గ్గ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ అసంతృప్తిని పెద్ద‌గా విడిచిపెట్ట‌లేద‌ని చెప్పాలి. న‌యానా.. భ‌యానా.. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో స్టైల్లో కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ప‌ద‌వులు రాని వారిని మాత్ర‌మే కాదు.. ప‌ద‌వులు కోల్పోయి కోపంగా ఊగిపోతున్న వారిని కూల్ చేసేందుకు బాబు బ్యాచ్ రంగంలోకి దిగి.. ఎవ‌రికి వారు త‌మ‌కు అప్ప‌గించిన ప‌నుల్ని పూర్తి చేశారు. దీంతో.. ఏపీ అధికార‌ప‌క్షంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించిన బొజ్జ‌ల గోపాల‌కృష్ణ‌ను బుజ్జ‌గించేందుకు మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ఎంపీ సీఎం ర‌మేష్ లు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. మంత్రి ప‌ద‌వి పోయినందుకు బాధ ప‌డొద్ద‌ని.. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇస్తామ‌ని.. ఆయ‌న కుమారుడు సుధీర్ రెడ్డిని శ్రీకాళ‌హ‌స్తి ఇన్ ఛార్జ్ గా నియ‌మిస్తామ‌న్న మాట‌ను సీఎం చంద్ర‌బాబు చెప్పార‌ని చెప్ప‌టంతో ఆయ‌న కాస్త మెత్త‌ప‌డ్డ‌ట్లు చెబుతున్నారు. దీంతో.. బొజ్జ‌ల ఎపిసోడ్ ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

మంత్రిప‌ద‌వి రానందుకు అంద‌రికంటే అగ్గిఫైర్ అయి.. అవ‌స‌ర‌మైతే పార్టీ పెడ‌తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను కంట్రోల్ చేయ‌టానికి తెర వెనుక భారీ క‌స‌ర‌త్తు జ‌రిగింద‌ని చెబుతున్నారు. కేసుల బూచితో ఆయ‌న నోటికి తాళం వేసిన‌ట్లుగా స‌మాచారం. ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన హెచ్చ‌రిక‌ల‌తో ఆయ‌న వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల‌కు త‌గ్గ‌ట్లే న‌డుచుకుంటానంటూ విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదంటూ అగ్గిఫైర్ అయిన బొండా ఉమ‌కు సీఎం చంద్ర‌బాబే స్వ‌యంగా అక్షింత‌లు వేయ‌టం.. ఎక్కువ చేస్తున్నావ‌న్న మాట‌తో ఆయ‌న్ను దారికి తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌మ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదంటూ పెడ‌న ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు కార్య‌క‌ర్త‌లు బంద్ కు పిలుపునివ్వ‌గా.. అలాంటివి చేయొద్దంటూ ఆయ‌న వారించారు. అంతేకాదు.. మంత్రులు క‌ళా వెంక‌ట్రావు.. దేవినేని ఉమ‌.. ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడితో ముఖ్య‌మంత్రిని క‌లిసిన కాగిత వెంక‌ట్రావు.. త‌న విధేయ‌త‌ను చాటి చెప్పి.. అధినేత మ‌న‌సును దోచుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రానందుకు కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని.. తాను స‌ర్దిచెప్పిన‌ట్లుగా చెప్ప‌టం ద్వారా.. ఇత‌ర ప‌ద‌వుల‌కు త‌న పేరును ప‌రిశీలించాల‌న్న విన్న‌పాన్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా చేశార‌ని చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే.. ఆయ‌న‌కు రానున్న రోజుల్లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్న హామీని చంద్ర‌బాబు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

మిగిలిన త‌మ్ముళ్ల‌కు భిన్నంగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర తీరు ఉంద‌ని చెప్పాలి. లోప‌ల మంట మండుతున్నా.. త‌న అసంతృప్తిని మాట వ‌ర‌స‌కుకూడా బ‌య‌ట‌పెట్ట‌ని ఆయ‌న్ను.. మంత్రి అమ‌ర‌నాథ్ రెడ్డి న‌రేంద్ర ఇంటికి వెళ్లటం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి సందేశాన్ని న‌రేంద్ర‌కు అమ‌ర్ నాథ్ రెడ్డి అందించిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న చిర‌కాల మిత్రుడి ఇంటికి భోజ‌నానికి వ‌చ్చిన‌ట్లుగా అమ‌ర్ నాథ్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర మౌనంగా ఉండ‌టం విశేషం. ఇక‌.. ప‌ద‌వి రాక అసంతృప్తిగా ఉన్న అనంత‌పురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థ‌సార‌థి కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపున‌కు కృషి చేస్తామ‌ని చెప్ప‌టం ద్వారా.. ఆదివారం అసంతృప్తి త‌న‌ను వీడిపోయింద‌న్న సంకేతాన్ని ఇచ్చారు.

వీరంద‌రికి భిన్నంగా ఇద్ద‌రు నేత‌ల తీరు ఉంద‌ని చెప్పాలి. వారిలో ఒక‌రు శ్రీకాకుళం జిల్లా ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుంద‌ర్ శివాజీ.. ఆయ‌న కుమార్తె గౌతు శిరీష‌.. పార్టీకి త‌మ విధేయ‌త‌ను ప్ర‌క‌టించినా.. ప‌ద‌వి రాలేద‌న్న ఆవేద‌న‌తో క‌న్నీరు పెట్ట‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌టంతో పాటు.. సానుభూతి వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది. ఇక‌.. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం గ్రామీణ ఎమ్మెల్యే బుచ్చ‌య్య‌చౌద‌రి మాత్రం బెట్టు వీడ‌లేదు. మంత్రి ప‌ద‌వి రాని నేప‌థ్యంలో ఆయ‌న త‌న ఆగ్ర‌హాన్ని వీడ‌లేదు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి రాజీనామా మాట‌కు తానింకా క‌ట్టుబ‌డి ఉన్నాన‌నే ఆయ‌న చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/