Begin typing your search above and press return to search.

చంద్రబాబు కృతజ్ఞతలు కూడా చెబుతారంట

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:11 AM GMT
చంద్రబాబు కృతజ్ఞతలు కూడా చెబుతారంట
X
ఒకవైపు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి దక్కాల్సిన హక్కును సర్వనాశనం చేసేసారని చంద్రబాబు మీద ప్రజల్లో విపరీతమైన కోపావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా అనే దానిని స్వయంగా చంద్రబాబు నాయుడే మంట గలిపేశాడని.. ఒక వేళ ప్రత్యేక హోదా వచ్చే ఉంటే గనుక ఆయన ప్రభుత్వానికే ఎంతో లబ్ధి జరిగి ఉండేదని ఆయన ఇవాళ పరిశ్రమలు రాబట్టడం కోసం ఒక్కొక్క దేశానికి కాలికి బలపం కట్టుక తిరగాల్సిన ఖర్మ పట్టకుండా ఉండేదని.. ప్రత్యేక హోదా వచ్చి వుంటే గనుక ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఎగబడి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టివుండేవారని అనేక మంది ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు.

ఇలాంటి నేపధ్యంలో సోమవారం నాడు ఛలో అసెంబ్లీ నిర్వహించడానికి వామపక్షాలు ప్రయత్నించినప్పుడు వాటిని ఈసడించుకుంటూ.. అలాంటి ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిరసిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రసంగం విమర్శలకు గురవుతుంది. ‘ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం.. మళ్లీ ఇబ్బంది పెట్టొద్దు, ప్రత్యేక హోదా పేరుతో రచ్చ చేయొద్దు’ అంటూ ఆయన ఎవరికి నీతులు చెబుతున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. హోదాకు సమానమైన సాయం అందుకునే ప్యాకేజీని ఒప్పుకున్నా అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్రానికి ఏం సాయం అందిందో ఆయన ప్రజలకు నివేదించాల్సి ఉంది. మామూలుగా అన్ని రాష్ట్రాలకు దక్కినట్లుగా కేంద్రం నుంచి దక్కవల్సిన పన్నుల్లో వాటాలు.. దక్కవల్సిన నిధులు తప్ప ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాధలాగా ఏర్పడినందుకు గానూ కేంద్ర ఎలాంటి ప్యాకేజీ సాయం మనకు అందించింది.. ఇప్పటిదాకా అలాంటి ప్యాకేజీ సాయంతో ఏ పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి అనేది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చెప్పగలిగే స్థితిలో ఉన్నారో లేదో తెలీదు.

అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడొక మరో మతలబు కూడా పెడుతున్నారు. కేంద్రం నుంచి ఇప్పటిదాకా వచ్చిన నిధులపై ఇదే సమావేశాల్లో చర్చించి.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం.. ఆ తీర్మానాన్ని కేంద్రానికి నివేదించి.. ఆ తర్వాత మరో సారి నిధులు ఇవ్వాలంటూ మరో సారి డిల్లీ వెళ్లి కోరుతాం అని అయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఏం ప్రత్యేక సాయం అందింది అని అడిగితే గనుక వారికి కృతజ్ఞ తలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం పెడతారు? అసలు అందిన సాయమేమిటో ప్రజలకు చెప్పకుండా.. ఆ సాయం ద్వారా చేపట్టిన పనులేమిటో ప్రజలకు చెప్పకుండా.. ప్రజలందరూ మురిసిపోతున్నట్లుగా కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానం చేయడానికి ప్రభుత్వానికి ఎలా మనసొప్పుతుందో మాత్రం అర్ధం కావడంలేదు.

ఇప్పటిదాకా- శంకుస్థాపన నాడు మోదీ విదిల్చిన మట్టి తప్ప మరో సాయం రాష్ట్రానికి ప్రత్యేకంగా అందినట్లు దాఖలాలు మనకు కనిపించడంలేదు. హోదా కోసం పోరాటాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధంగా తుంగలో తొక్కేశారు. అయితే ఇప్పటికీ హోదా కోరుకుంటున్న ప్రజల గళాన్ని ఢిల్లీకి వినిపిస్తే ఆయనకు పోయేదేముందో అర్ధం కావడం లేదు. నన్ను విమర్శించే వాళ్లంతా ఢిల్లీ వెళ్లి అక్కడ చెప్పండి అని ఆయన ఏ రకంగా సభలో అనగలుగుతున్నారో కూడా అర్ధం కావడం లేదు. అమరావతిలో జరగనిది హస్తినలో జరుగుతుందా? అమరావతికి సంబంధించిన సమస్యని.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యని రాష్ట్ర వేదిక మీద ప్రకటించకుండా.. రాష్ట్ర వేదిక మీద వ్యక్తం చేయకుండా.. ఢిల్లీలో చెప్పింనంత మాత్రాన ఏం జరుగుతుంది? ఇలా చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ‘కృతజ్క్షతలు చెప్పడం’ అనే మాట ద్వారా, కేంద్రం ఏదో వొరగ బెట్టేసిందని.. తాము కేంద్రం నుంచి ఏదో సాధించుకు వచ్చేశామని అసెంబ్లీ తీర్మానాల్లో ఒక వాక్యం వ్యక్తం చేయడం మినహా.. ప్రజలను మభ్యపుచ్చడం.. ప్రజలను ఒక రకమైన మాయ చేయడం అనేది సాధ్యంకాకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.