Begin typing your search above and press return to search.

చంద్రబాబు సభకు జనం కావలెను!

By:  Tupaki Desk   |   29 April 2018 4:41 PM GMT
చంద్రబాబు సభకు జనం కావలెను!
X
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతిలో సోమవారం నాడు నమ్మకద్రోహం సభ నిర్వహించబోతున్నారు. అయితే ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు... కేవలం ప్రెవేటు పార్టీ కార్యక్రమం మాత్రమే. ఇంచు మించుగా రాజకీయ సభ లాంటిదే. ఇదే ప్రభుత్వ కార్యక్రమం అయితే గనుక.. జనాన్ని తరలించడం చంద్రబాబు కోటరీకి నల్లేరుపై బండి నడక లాగా అయిపోయేది. సునాయాసంగా లక్ష మందిని సమీకరించాలనే టార్గెట్ ను అందుకునే వాళ్లే. ఇది కాస్తా పార్టీ కార్యక్రమం అయ్యేసరికి.. దొంగమార్గాల్లో జనాన్ని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

బాబు కేబినెట్ లోని సుమారు ఆరేడు మంది మంత్రులు ఆదివారం నాటికే తిరుపతి చేరుకున్నారు. వివిది అతిథి భవనాల్లో తిష్ట వేసి జనసమీకరణ గురించి జిల్లా నాయకులను ఫాలో అప్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎటూ తిరుపతి సభ శ్రీకారంగా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ విడివిడిగా బహిరంగ సభలు నిర్వహించి.. భాజపాను తూర్పారపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో... ఈ తిరుపతి సభకు జనాన్ని సమీకరించడాన్ని చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు.

ఆ క్రమంలో ముందురోజే తిరుపతికి వచ్చిన మంత్రులు స్థానికంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలు, క్షేత్ర స్థాయి నాయకులతో భేటీలు అవుతూ, ఫోన్లు చేస్తూ జనసమీకరణ ఏ విధంగా ఉండబోతున్నదో ఆరాలు తీస్తున్నారు. మొత్తం లక్ష మందిని సమీకరించాలనేది టార్గెట్ కాగా, ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినప్పటికీ.. అనధికారికంగా డ్వాక్రా సభ్యులందరినీ తరలించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వం ఆదేశించినట్లుగా కాకుండా - డ్వాక్రా మహిళలు వారంతట వారే వచ్చినట్లుగా సభకు రావాలంటూ.. అనధికారిక ఉత్తర్వుల ద్వారా సబంధిత అధికార్లు గ్రూపు లీడర్లతో సమావేశాలు నిర్వహించి.. పురమాయిస్తున్నట్లు తెలుస్తోంది. సభకు వచ్చినందుకు డబ్బు కూడా ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తున్నది. డ్వాక్రా మహిళల్లో పలువురు డబ్బు ఆశ చూపుతున్నా సరే సభకు రావడానికి వారు విముఖంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రకరకాల ప్రలోభాల ఆశ చూపించి డ్వాక్రామహిళలను సభకు రప్పించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.