Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి బాబు హాజ‌రు ప‌క్కా!

By:  Tupaki Desk   |   28 May 2019 2:30 PM GMT
జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి బాబు హాజ‌రు ప‌క్కా!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 30న ఏపీకి కొత్త ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ కు రాజ‌కీయంగా బ‌ద్ధ విరోధిగా టీడీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం జ‌గ‌న్ స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి... త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రు కావాల‌ని కోరారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రావాల‌న్న జ‌గ‌న్ విజ్ఞ‌ప్తికి చంద్ర‌బాబు కూడా సానుకూలంగానే స్పందించార‌ట‌. దీంతో జ‌గ‌న్ -ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి చంద్ర‌బాబు రావ‌డం ఖాయ‌మేన‌ని తెలుస్తోంది.

సాధార‌ణంగా ఎన్నిక‌ల్లో ఎంత‌మేర ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకున్నా... ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఒకరు అధికార ప‌క్షంగా మ‌రొక‌రు విప‌క్షంగా ఉండాల్సిందే. ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే ఎద‌రు గెలిచినా... ఓడిన వారిని త‌మ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఆహ్వానించ‌డం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబుకు స్వ‌యంగా ఫోన్ చేయ‌డం, చంద్ర‌బాబు కూడా వ‌స్తాన‌ని చెప్ప‌డం జ‌రిగిపోయింది. అయితే ఆహ్వానిస్తే... అక్క‌డిక‌క్క‌డే తాను రాలేన‌ని ముఖం మీదే చెప్పేయ‌డం కుద‌ర‌దు క‌దా. మ‌రి పిలిచారు కాబ‌ట్టి... ఏదో వ‌స్తామ‌ని మాత్ర‌మే చంద్ర‌బాబు చెప్పారా? అన్న దిశ‌గానూ ఇప్పుడు విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. గ‌తంలో 2004,2009ల‌లో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన‌ప్పుడు కూడా స్వ‌యంగా వైఎస్ నుంచే ఆహ్వానం ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు త‌న ప్ర‌తినిధి బృందాన్ని పంపి తాను మాత్రం దూరంగా ఉన్నారు.

ఇక 2014లోనూ చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు జ‌గ‌న్ ఆయ‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రు కాలేదు. ఈ ఘ‌ట‌న‌ల‌ను బేరీజు వేస్తున్న చాలా మంది ఏదో వస్తామంటూ చంద్ర‌బాబు చెప్పినా... ఆయ‌న మాత్రం గ‌తంలో మాదిరే ఇప్పుడు కూడా ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రు కాక‌పోవ‌చ్చ‌ని విశ్లేషిస్తున్నారు. అయితే స్వ‌యంగా జ‌గ‌న్ ఫోన్ చేయ‌డం, సంభాష‌ణ‌లో ఇద్ద‌రి మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణంలో మాట్లాడుకోవ‌డం, త‌న ప్ర‌మాణ స్వీకారానికి ఎవ‌రెవ‌రు వ‌స్తున్నార‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు అడ‌గ‌కున్నా... జ‌గ‌నే స్వ‌యంగా ఆయ‌న‌కు చెప్ప‌డం, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రావాల‌ని జ‌గ‌న్ ఆహ్వానించ‌డం, రాష్ట్రంలోని తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, టీడీపీ భ‌విష్య‌త్తు... త‌దిత‌రాల‌న్నింటినీ బేరీజు వేసుకున్న త‌ర్వాత చంద్ర‌బాబు... జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి త‌ప్ప‌నిస‌రిగా హాజ‌ర‌వుతార‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?