Begin typing your search above and press return to search.

ఇక‌.. అమ‌రావ‌తి బాండ్లు..?

By:  Tupaki Desk   |   8 Sep 2015 9:08 AM GMT
ఇక‌.. అమ‌రావ‌తి బాండ్లు..?
X
త‌న రాజ‌కీయ కెరీర్‌ లో ఎప్పుడూ ఎదుర్కొనంత ఒత్తిడిని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉండి ఇంత ఒత్తిడిని ఎదుర్కోవ‌టం చంద్ర‌బాబు బ్యాడ్ ల‌క్ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. పేరుకు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లా మారింది. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ అన్న చందంగా.. పేరు ప్ర‌ఖ్యాతుల‌కు ఢోకా లేకున్నా.. చేతిలో చిల్లిగ‌వ్వ లేక‌పోవ‌టం.. స్నేహితుల‌న్న వారు సాయం చేయ‌టానికి మాత్రం సిద్ధంగా లేక‌పోవ‌టంతో ఎవ‌రి బాధ‌లు చెప్పుకోవాలో అర్థం కాక కిందామీదా ప‌డుతున్నారు.

క్యాలెండ‌ర్ లో రోజులు గిర్రున తిరిగిపోవ‌టం.. అనుకున్నంత సంగ‌తి త‌ర్వాత అందులో ప‌దో వంతు కూడా ప‌నులు ముందుకు వెళ్ల‌క‌పోవ‌టం ఆయ‌నకు ఇబ్బందిక‌రంగా మారింది. 2018 నాటికి ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించిన ప‌నులు ఎంతో కొంత పూర్తి చేసి.. బిల్డింగులు చూపిస్తే త‌ప్పించి.. చంద్ర‌బాబు త‌న స‌మ‌ర్థ‌త‌ను చాటి చెప్పుకోలేని ప‌రిస్థితి.

స‌రే.. ఏదో ఒక‌టి చేసి ఇలాంటివి చేయాల‌ని అనుకున్నా.. అన్నింటికి మూల‌మైన నిధుల కొర‌త బాబు స‌ర్కారును విప‌రీతంగా వేధిస్తోంది. ఏ ప‌ని చేయాల‌న్నా అవ‌స‌ర‌మైన నిధుల‌కు సంబంధించి కేంద్రం నుంచి స‌హ‌కారం లేక‌పోవ‌టం.. ఇప్ప‌టికే నెల‌స‌రి ఖ‌ర్చుల కోసం వీలైన‌న్ని మార్గాల్లో నిధులు తీసుకొచ్చి ఖ‌ర్చులు చేస్తున్న చంద్ర‌బాబుకు.. రాజ‌ధాని నిర్మాణం లాంటి వాటికి మ‌రిన్ని నిధుల స‌మీక‌ర‌ణ త‌ల‌కు మించిన భారంగా మార‌నున్నాయి. అందుకే.. ఆయ‌న కొత్త‌గా.. స‌రికొత్త ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధులకు సంబంధించి ఆయ‌న సెంటిమెంట్ ను ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే.. అమ‌రావ‌తి న‌గ‌రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామ‌ని స్కెచ్‌ లు చూపించి నోరూరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల కోసం బాండ్ల‌ను విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అంతేకాదు.. అమ‌రావ‌తి బాండ్లు కొన్న వారికి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. తొలిద‌శ‌లో రాజ‌ధాని నిర్మాణానికి సుమారు రూ.60వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచ‌నా. ఇంత భారీ మొత్తంలో కేంద్రం నుంచి నిధులు రావ‌టం అసాధ్యం.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున బాండ్ల రూపంలో నిధులు సేక‌రించి ప‌నులు పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి.. ఇంత భారీ మొత్తాన్ని సేక‌రించ‌టం మంచిదా? కాదా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే.. మొన్నామ‌ధ్య ముగిసిన గోదావ‌రి మ‌హాపుష్క‌రాల సంగ‌తే చూస్తే.. దాదాపు రూ.1600కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు చెబుతున్నా.. జ‌రిగిన ప‌నులు చూస్తే.. భారీగా అవినీతి చోటు చేసుకుంద‌న్న వాద‌న‌లు వినిపించాయి. మ‌రి..అలాంటిది బాండ్ల రూపంలో రూ.50వేల కోట్లు అంటే మామూలు కాదు. అందులో భారీగా నిధులు ప‌క్క‌దారి ప‌డితే.. బాబు స‌ర్కారు ఉనికికే ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంది. ఇంత భారీ రిస్క్ బాబు చేస్తారా? లేదంటే అందుకోసం మ‌రేదైనా మాస్ట‌ర్ ప్లాన్ వేస్తారా? అన్న‌ది ఇప్పుడు వేధిస్తున్న ప్ర‌శ్న‌. వీటితో పాటు బాండ్ల సేక‌ర‌ణ‌కు సెబి నుంచి అనుమ‌తులు లాంటి వ్య‌వ‌హారాలు ఉండ‌నే ఉన్నాయి. మ‌రి.. వాటి విష‌యంలో ఏం చేస్తార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌.

ఇదిలా ఉంటే.. బాండ్ల ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ చేయ‌టం ద్వారా.. రాష్ట్రం మ‌రింత అప్పుల ఊబిలోకి చిక్క‌కుపోతుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఇలాంటి ఇబ్బందుల్ని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.