Begin typing your search above and press return to search.

వాళ్లందరికి బాబు భారీగా ఇళ్లు కట్టిస్తారట

By:  Tupaki Desk   |   15 Feb 2017 2:00 PM GMT
వాళ్లందరికి బాబు భారీగా ఇళ్లు కట్టిస్తారట
X
చేస్తారా? చేయరా? అన్నది పక్కన పెడితే.. భారీ ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు కనిపిస్తారు. గతంలో ఆయన మాటలకు.. చేతలకు.. ఇప్పటికి మధ్య వ్యత్యాసం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల విశాఖపట్నంలో ఏపీ పెట్టుబడుల కోసం నిర్వహించిన సదస్సు భారీగా సక్సెస్ అయ్యిందని.. దాదాపు పది లక్షల కోట్ల రూపాయిలకు పైనే పెట్టుబడుల్ని ఆకర్షించినట్లుగా ఘనంగా ప్రకటనలు చేశారు. అది పూర్తి అయ్యిందో లేదో.. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహించారు.

ఈ రెండు కార్యక్రమాల వల్ల ఏపీ ఇమేజ్ ఎంత పెరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే.. భారీ ఖర్చు మాత్రం మిగిలిందనటంలో సందేహం లేదు. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సదస్సుతో పోలిస్తే.. కొద్దోగొప్పో మహిళా పార్లమెంటరీ సదస్సు ఒకింత బెటర్ అని చెప్పాలి. కానీ.. ఆ సదస్సును ఏపీ సర్కారు నిర్వహించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఉద్దేశించిన సదస్సులో.. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫ్లాట్లు అమ్ముకునే వారితోనూ ఏపీ సర్కారు ఎంవోయూలు చేసుకుందంటూ కొన్ని మీడియా సంస్థలు ఆధారాలతో సహా ప్రచురించిన కథనాలతో ఏపీ సర్కారు పరువు ఎంత పోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా భారీ కల ఒకటి చంద్రబాబు ప్రకటించారు.

ఏపీ రాజధాని ప్రాంతంలో త్వరలో భారీ గృహనిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా చెప్పుకొచ్చారు. వేగం..నాణ్యత.. సృజనాత్మకతను ప్రమాణాలుగా పెట్టుకొని అమరావతిలో భారీగా నిర్మాణ పనుల్ని చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. మొత్తం 139 ఎకరాల స్థలంలో దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు అవసరమైన నివాసాల్ని నిర్మించనున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఈ తొమ్మిది వేలమందిలో జడ్జిలు మొదలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో పాటు.. వివిధ వర్గాల గెజిటెట్ అధికారులు.. నాన్ గెజిటేటెడ్ అధికారులకు అవసరమైన ఇళ్లను నిర్మించనన్నట్లుగా వెల్లడించారు. ఈ ఇళ్లు 900 చదరపుఅడుగులు మొదలు 2900 చదరపు అడుగుల్లో వివిధ కేటగిరీల్లో ఉంటాయని.. జీప్లస్8 కింద అపార్ట్ మెంట్లు నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇంత భారీగృహ నిర్మాణాన్ని ఎప్పుడు మొదలుపెడతారు? ఎప్పటికిపూర్తి చేస్తారు? ఇందుకు అవసరమైన నిధుల్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారన్న అసలుసిసలు ప్రశ్నలకుసమాధానాలు చెబితే బాగుండేది. అవసరమైన ప్రశ్నలకు సమాధానాలు.. సమాచారం ఇస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/