Begin typing your search above and press return to search.

ప్రకాశంలో తూర్పు.. పడమరలుగా మారిన తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   6 Jun 2016 4:23 AM GMT
ప్రకాశంలో తూర్పు.. పడమరలుగా మారిన తమ్ముళ్లు
X
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందంటారు. ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అలానే ఉంది. నలుగురు అదనంగా పార్టీలోకి వస్తే బలం పెరగాల్సింది పోయి.. నేతల మధ్య అసంతృప్తి పార్టీని మరింత బలహీనం చేస్తున్న దుస్థితి. ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రంతో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారు. ఇలా అధికారపార్టీలోకి వస్తున్న నేతల పట్ల ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఇబ్బందులు కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. అయితే.. ప్రకాశం జిల్లాలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం.

నిజానికి ఇలాంటి పరిస్థితి తెలంగాణ అధికారపక్షంలో ఉన్నప్పటికీ తమ అసంతృప్తిని బాహాటంగా బయటపెడితే.. కేసీఆర్ ఆగ్రహానికి గురి కాక తప్పదని.. ఆయన దృష్టిలో ఒక్కసారి తేడా లెక్కలోకి వెళితే.. భవిష్యత్తు మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న భయం వారి కోపతాపాల్ని బయటకు రానివ్వకుండా చేస్తోంది. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో ఇదే తరహాలో అంతర్గత విభేదాలు బజారున పడిన సంగతి తెలిసిందే. భూమా.. శిల్పా బ్రదర్స్ మధ్య పంచాయితీని చంద్రబాబు కల్పించుకోవాల్సి వచ్చింది. ఇరువురిని కలిపి కూర్చోబెట్టిన చంద్రబాబు విభేదాలు మరిచి పార్టీ కోసం పని చేయాలని.. పార్టీని బలోపేతం చేయటానికి భిన్నంగా వ్యవహరిస్తే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని మాట్లాడిన తర్వాత యాంత్రికంగా చేతులు కలుపుకున్నారు. బయటకు రాగానే ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం ఇష్టం లేనట్లుగా వ్యవహరించటం కనిపించింది.

ఇది కర్నూలు పంచాయితీ అయితే.. ప్రకాశంలో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ఏపీ నవనిర్మాణ దీక్ష సభల్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. జిల్లాల వారీగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం కాస్తా.. గ్రూపుల మధ్య అధిపత్యపోరుగా మారటం విశేషం. ఎవరికి వారు.. వైరి వర్గం కంటే మిన్నగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న లక్ష్యమే తప్పించి పార్టీని ఏకతాటి మీద నడిపేలా చేయాలన్న ఆలోచన కనిపించకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో నేతలు నిర్వహించిన కార్యక్రమానికి ఆయా వర్గానికి సంబంధించిన వారు తప్పించి.. వైరి వర్గం వారు ఆ కార్యక్రమం ముఖం కూడా చూడని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితి ఒకటో అరో కాకుండా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. గిద్దలూరు.. అద్దంకి.. కందుకూరులలో ఇవే పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం.. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించటం.. ఒకరు నిర్వహించే కార్యక్రమానికి మరో వర్గం వారు వెళ్లని పరిస్థితి. మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే.. నవనిర్మాణ దీక్షకు ఎవరి దుకాణం వారు అన్నట్లుగా నేతలు వ్యవహరించటంతో కార్యక్రమాలన్నీ సోసోగా సాగాయే తప్పించి.. స్ఫూర్తివంతంగా ప్రజల్ని ఉత్తేజపూరితంగా జరగలేదు. ఇలాంటి పరిస్థితే మరికొంతకాలం సాగితే.. పార్టీ పట్ల ప్రజల్లో పలుచన కావటం ఖాయం.

అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు.. కరణం బలరాంకు మధ్యనున్న గొడవలు అందరికి తెలిసిందే. ఈ ఇద్దరూ పంతంగా ఉండటమే తప్పించి.. ఇద్దరి మధ్య రాజీ లేకపోవటం ఒకరిపై ఒకరు అధిపత్యాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం మరింత ఎక్కువగా మారింది. ఇక.. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి.. టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్న అన్నా రాంబాబుకు పొసగని పరిస్థితి. ఇక.. కందుకూరు నియోజకవర్గం విషయానికి వస్తే పార్టీలో కొత్తగా చేరిన పోతుల రామారావు గైర్హాజరు అయ్యారు. ఇలా ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీని నష్టపర్చటం ఖాయంగా మారింది. నేతల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారపక్షంలో ఉన్నప్పుడే ఇంత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నేతలకు ముకుతాడు వేయకుంటే.. భవిష్యతులో చంద్రబాబు మరిన్ని ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి.