Begin typing your search above and press return to search.

సీబీఎన్ 'పాయిజ‌న్ పిల్' పాలిటిక్స్ చేయ‌బోతున్నారా.. కొత్త ప‌దం!

By:  Tupaki Desk   |   20 April 2022 6:30 AM GMT
సీబీఎన్ పాయిజ‌న్ పిల్ పాలిటిక్స్ చేయ‌బోతున్నారా.. కొత్త ప‌దం!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో తిరిగి ప‌ట్టు కోసం మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా పార్టీని గెలిపించుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. వ్యూహాల్లో మునిగిపోయారు. అయితే ఇప్పుడాయ‌న వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు కొత్త పంథాలో వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. రాజ‌కీయాల్లో పాయిజ‌న్ పిల్ వ్యూహాన్ని అవ‌లంబించ‌బోతున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పుడు జ‌గ‌న్ కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. బాబు దూకుడుగా వ్య‌వ‌హ‌రించి ఈ టెక్నిక్‌తో ప్ర‌త్యర్థికి చెక్ పెట్ట‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

పాయిజ‌న్ పిల్ అంటే..ప్ర‌త్య‌ర్థి మ‌న‌పై ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు.. అవ‌తలి వాళ్ల‌కు దెబ్బ ప‌డేలా చేయ‌డ‌మే ఈ పాయిజ‌న్ పిల్ అనే వ్యూహం. ఈ ప‌దం ఎక్కువగా కార్పొరేట్ కంపెనీల కొనుగోళ్ల‌లో, యుద్ధాల్లో వినిపిస్తుంది. తాజాగా ట్విట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు ఎల‌న్ మాస్క్ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ దానికి ట్విట‌ర్ సుముఖంగా లేదు. అందుకే ఆ కంపెనీ ఇప్పుడు పాయిజ‌న్ పిల్ అనే వ్యూహాన్ని వాడి ఎల‌న్‌కు చెక్ పెట్టాల‌ని చూస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్పుడు ఈ వ్యూహంలో భాగంగా భారీ ఎత్తున కొత్త షేర్ల‌ను సృష్టించి మార్కెట్లోకి వ‌దిలే అవ‌కాశం ఉంది. అప్పుడు బ‌ల‌వంతంగా కంపెనీని కొనుగోలు చేయాల‌నేవారికి ఇది ప్ర‌తికూలంగా మారుతుంది. మ‌రో వ్యూహం ప్ర‌కారం కొంత‌మంది షేర్ హోల్డ‌ర్ల‌కు త‌మ వాటా పెంచుకునే అవ‌కాశం ఇచ్చే వీలుంది. పీపుల్‌సాఫ్ట్ కంపెనీని ఒరాకిల్ కొనాల‌ని ప్ర‌య‌త్నించ‌గా.. పీపుల్‌సాఫ్ట్ పాయిజ‌న్ పిల్ వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఎట్ట‌కేల‌కు పీపుల్‌సాఫ్ట్‌ను ఒరాకిల్ కొన్న‌ప్ప‌టికీ తాను ఆఫ‌ర్ చేసిన దానికంటే అత్య‌ధిక మొత్తం 11.1 బిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాల్సి వ‌చ్చింది. ఇది పీపుల్‌సాఫ్ట్ విజ‌యానికి నిద‌ర్శ‌నం. ఇక ర‌ష్యాతో యుద్ధంలో యూరోపియ‌న్‌, అమెరికా దేశాలు ఈ ప్లాన్ అమ‌లు చేశాయి కాని ఫెయిల్ అయ్యాయి.

ఇప్పుడు బాబు..రాజ‌కీయాల్లో కొత్త పంథా కోసం చూస్తున్న చంద్ర‌బాబు ఇప్పుడు పాయిజ‌న్ పిల్ వ్యూహాన్ని అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. జ‌గ‌న్ కొత్త‌గా ఏర్పాటు చేసిన కేబినేట్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కులు లేరు. బాబును అటాక్ చేసే నేత‌లు క‌నిపించ‌డం లేదు. సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్ మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు. కానీ అది బాబుకు మేలు చేసే అవ‌కాశాలే ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌తంలో అంటే అనిల్ కుమార్‌, కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని లాంటి వైసీపీ పిల్ల‌ర్లు కేబినేట్లో ఉంటూ బాబుపై విరుచుకుప‌డ్డారు. నానీలిద్ద‌రూ మాట‌ల‌తో బాబుపై చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఇక బాలినేని రాజ‌కీయ వ్యూహాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అనిల్ కుమార్ బీసీ కార్డుతో ప‌వ‌న్‌పై సెటైర్లు వేసేవారు. కాపు సామాజిక వ‌ర్గంలో పేర్ని నాని ఫైర్ బ్రాండ్‌గా మారారు.

బాబు ఎదురు దాడి..ఇప్పుడు ఫైర్‌బ్రాండ్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి జ‌గ‌న్ కేబినేట్ ఏర్పాటు చేయ‌డంతో బాబు ఎదురు దాడికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుత కేబినేట్లో బొత్స‌, రోజా లాంటి లీడ‌ర్లు ఉన్నారు. కానీ బొత్స ఏం మాట్లాడే విష‌యాలు అర్థ‌మే కావ‌నే అభిప్రాయాలున్నాయి. ఇక రోజాకు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ ప‌రంగా చాలా స‌మ‌స్య‌లున్నాయి. ఇక మిగిలిన సీనియ‌ర్ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌వ‌న్పై, బాబుపై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశాలు త‌క్కువ‌.

దీంతో ప‌ద‌వులు పోయిన 14 మంది మాజీ మంత్రులను టార్గెట్ చేస్తే వాళ్ల‌కు స‌పోర్ట్ ఇచ్చే నాయ‌కులు ఉండ‌ర‌నేది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. వాటికి కౌంట‌ర్లు ఇచ్చే సామ‌ర్థ్యం ఉన్న నేత‌లు కేబినేట్లో క‌నిపించ‌డం లేద‌న్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు మంత్రులుగా ఉన్న‌వాళ్ల‌పై వివిధ ఆరోప‌ణ‌లు చేస్తూ ఇర‌కాటంలో పెట్టాల‌న్న‌ది బాబు వ్యూహమ‌ని స‌మాచారం. మొత్తానికి ఇలా పాయిజ‌న్ పిల్ టెక్నిక్‌తో వైసీపీని దెబ్బ కొట్టేందుకు బాబు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది.