Begin typing your search above and press return to search.

బాబు బ్యాడ్ టైం అంటే ఇదే మ‌రి

By:  Tupaki Desk   |   5 Sep 2016 5:30 PM GMT
బాబు బ్యాడ్ టైం అంటే ఇదే మ‌రి
X
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశం పెద్ద దుమారం రేపుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ స్పెష‌ల్ స్టేట‌స్‌ పై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్షాలు - ఆయా సంఘాలు క‌దులుతున్నాయి. ఇదిలాఉండ‌గా మరో రెండు ఊహించ‌ని ఉప‌ద్ర‌వాలు బాబు ముందు వ‌చ్చిప‌డ్డాయి అందులో ఒక‌టి అసెంబ్లీ స‌మావేశాలు కాగా...మ‌రొక‌టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదాపై కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండటం. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం గ‌తంలో హామీ ఇచ్చిన‌ట్లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే పరిస్థితులు క‌నిపించ‌డం లేదు. ప్ర‌త్యేక‌ ప్యాకేజీ వైపే మొగ్గు చూపుతున్నట్లు లీకులవ్వడంతో ఏపీలో ఒకింత క‌ల‌క‌లం రేగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష వైసీపీ చంద్ర‌బాబును టార్గెట్ చేసింది. ఈ దాడికి కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాలు సైతం తోడ‌య్యాయి. ఈ విమ‌ర్శల ప‌ర్వాన్ని ఎలా ఎదుర్కోవాలో సీఎం చంద్రబాబుకు అర్థంకాని ప‌రిస్థితి. మరోవైపు టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీమాంధ్రుల‌ ఆత్మ‌గౌర‌వం అనే పేరుతో స‌భ‌కు స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. ఆత్మ‌గౌర‌వం అంటే ఇపుడు ఏపీలో అర్థం ప్ర‌త్యేక హోదా అనే స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ ఇలా ఉంటే...ఈ నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ స‌మావేశాల వేదిక‌గా ఏపీలోని క‌రువు - అభివృద్ధిలో జాప్యం - ప్ర‌త్యేక హోదా - చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు వంటివి చ‌ర్చ‌కు రావ‌డం ఖాయం అని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అయోమయంగా మారిందని అంచనా వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో 7న చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాబు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా ఇస్తారా.. లేక ప్యాకేజీ ప్రకటిస్తారా అన్న దానిపై స్పష్టత కోరనున్నారని స‌మాచారం. అంతేకాకుండా ఇటు అసెంబ్లీ సమావేశాలు, అటు పవన్ కళ్యాణ్ సభ, ఇతర రాజ‌కీ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తార‌ని చెప్తున్నారు. ఏదిఏమైనా ప్ర‌స్తుతం బాబు బ్యాడ్ టైం న‌డుస్తుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.