Begin typing your search above and press return to search.

వలసల్తో మురిసిపోతే అంతే సంగతులు!

By:  Tupaki Desk   |   9 Oct 2017 4:17 AM GMT
వలసల్తో మురిసిపోతే అంతే సంగతులు!
X
చంద్రబాబునాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అరాచకమైన రాజకీయ విధానాలతో దూసుకుపోతోంది. ప్రతిపక్షాన్ని నేరుగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడు... డొంకతిరుగుడు మార్గాలను ఆశ్రయించాలనే వక్రనీతిని నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వీలైనంత మంది నాయకులను తమ పార్టీలో చేర్చేసుకుంటే.. ఆ మేరకు ఆ పార్టీ బలహీన పడిపోయినట్లే అనే భావనలో చంద్రబాబు పార్టీ మేనేజిమెంట్ ఉంది. గతంలోనూ ఆయన పలు సందర్భాల్లో వైసీపీ నుంచి గట్టి నాయకులు ఎవరైనా ఉంటే మన పార్టీలో చేర్చుకోండి.. అందరూ కలిసి పనిచేసుకోండి.. అంటూ మంత్రుల రేంజి సీనియర్ నాయకులకే పురమాయించిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఆయన ప్రలోభాలు పెట్టడానికి, ఒత్తిడి చేయడానికి పార్టీలో కొందరిని అప్రకటిత టీమ్ గా ఏర్పాటు చేశారని కూడా భోగట్టా.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా శ్రీకాకుళం కోలగట్ల వీరభద్ర స్వామి వైసీపీ కి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా ఉంది. పార్టీ జిల్లా సమన్వయ కర్తగా ఉన్న ఆయన ఏకంగా పార్టీనే వదిలేశారు. అయితే ఆయనకు, బొత్స సత్యనారాయణకు తొలినుంచి విభేదాలు ఉన్నాయి. బొత్స పార్టీలో చేరినప్పుడే కోలగట్ల అసంతృప్తి కి గురయ్యారు. ఆయనలోని అసంతృప్తిని తెలుగుదేశం రాజేసి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అలాగే వైసీపీ లో ఇతర ప్రాంతాలనుంచి కూడా వలసల్ని ప్రోత్సహించేందుకు ముచ్చటపడుతోంది.

అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం.. ఈ వలసలను చూసుకుని మురిసిపోవడానికి వీల్లేదని అంటున్నారు. ఏదో వైసీపీ నాయకులంతా తమకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రజల ముందు చాటుకోవడానికి ఇవి ఉపయోగపడతాయే తప్ప.. వాస్తవంలో పార్టీలో అంతర్గత ముఠా కక్షలు పెరిగిపోవడానికి దోహదం చేస్తాయనేది వారి ఆందోళన. చంద్రబాబునాయుడు ఎవరి సలహాలనూ పట్టించుకోకుండా, పార్టీ బలంగా ఉన్నచోట్ల కూడా వైసీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తూ అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలు పెరగడానికి పరోక్షంగా కారణం అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో తమ పార్టీలోనే ముఠాలు తయారవుతున్నాయని, పైగా చాలా నామినేటెడ్ పోస్టులను వైసీపీ నుంచి వచ్చిన వారు గద్దల్లా తన్నుకు పోతున్నారనే ఆవేదన కూడా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్న వారిలో వ్యక్తం అవుతోందని సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఇలాంటి హితవాక్యాలు బాబు చెవికి చేరుతాయో లేదో మరి.