Begin typing your search above and press return to search.

పోటీలో దిగక ముందే బాబు ఫెయిల్ అయ్యారా?

By:  Tupaki Desk   |   15 July 2015 3:58 AM GMT
పోటీలో దిగక ముందే బాబు ఫెయిల్ అయ్యారా?
X
ఈసారి గోదావరి పుష్కరాలకు చాలానే ప్రాధాన్యత ఉంది. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు భిన్నంగా.. ఈసారి వచ్చింది మహా పుష్కరాలని.. ఇలాంటివి వందేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయన్న వాదన ఉంది. మరోవైపు.. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాల్ని ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే.. పుష్కరాల పనుల గురించి ఏపీనే ముందుగా స్పందించింది. విభజన నేపథ్యంలో పుష్కరాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య పోలిక ఖాయమని.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణతో పోలిస్తే.. ఏపీలోనే ఏర్పాట్లు అదిరిపోయేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినట్లు చెబుతారు.

ప్రతి విషయంలోనూ పోలిక ఉంటుందని కాబట్టి.. చూపులకు సైతం విపరీతంగా ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసేందుకు ఏపీ సర్కారు సమాయుత్తమైంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణకు సంబంధించి గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఇబ్బందులెన్నో. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ రెండు జిల్లాల్లో ఏర్పాట్లు పక్కాగా చేస్తే.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఐదు జిల్లాల్లో పుష్కర ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి.

దీంతో.. జనాల సంఖ్య మొదలు.. అందరి దృష్టి ఆకర్షించేందుకు తమకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏపీ సీఎం భావించినట్లు చెబుతారు. ఊహించని విధంగా పుష్కరాల తొలిరోజునే రాజమండ్రి తొలి ఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటతో పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని షాక్ గా చెబుతున్నారు.

పన్నెండు రోజుల పాటు సాగే పుష్కరాల్ని అద్భుతంగా నిర్వహించి.. క్రెడిట్ కొట్టేద్దామని కసరత్తు చేసిన చంద్రబాబుకు.. తొక్కిసలాట పుణ్యమా అని పోటీలోకి ప్రవేశించకుండానే.. ఎంట్రీ లెవల్ లోనూ అడ్డంగా ఫెయిల్ అయిన పరిస్థితి అన్న భావన వ్యక్తమవుతోంది. అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించి.. విజేతగా నిలవాలని భావించిన చంద్రబాబు ఊహించని రీతీలో పరాజయం కావటాటినికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది.