Begin typing your search above and press return to search.

ఓటమి తర్వాత తొలిసారి చంద్రబాబు ఢిల్లీకి!

By:  Tupaki Desk   |   17 Jun 2019 7:29 AM GMT
ఓటమి తర్వాత తొలిసారి చంద్రబాబు ఢిల్లీకి!
X
సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత తొలి సారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టనున్నారు. కొన్ని అంశాలపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని పార్టీల వారినీ ఆహ్వానించగా ఆ సమావేశానికి చంద్రబాబుకు కూడా ఆహ్వానం దక్కింది. ఈ మీటింగుకు చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా హాజరయ్యే అవకాశాలున్నాయి.

ఈ మీటింగుకు చంద్రబాబు నాయుడే గాక మొన్నటి వరకూ ఆయన దోస్తులుగా వ్యవహరించిన వారు కూడా హాజరు కానున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ చంద్రబాబు నాయుడు చాలా మంది నేతలతో సత్సంబంధాలు నెరిపిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ వాళ్లతో చంద్రబాబు నాయుడు చాలా సన్నిహితంగా మెలిగారు. పలు సార్లు రాహుల్ గాంధీని కలిసి ఆయనకు శాలువా సత్కారాలు చేశారు. ఇక మమతా బెనర్జీతో పాటు బీజేపీ వ్యతిరేక వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో చాలా క్లోజ్ గా వెళ్లారు చంద్రబాబు నాయుడు.

కేంద్రంలో మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. అయితే తీరా ఎన్నికల ఫలితాలతో కథ ఎలా అడ్డం తిరిగిందో తెలిసిన సంగతే. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఊసు ఎవరకీ పట్టడం లేదు! ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా. తాము ఇప్పుడు బీజేపీకి - కాంగ్రెస్ కు సమదూరంలో ఉంటామంటూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ వాళ్లకు చెప్పారట. అప్పుడేమో బీజేపీ వ్యతిరేకత బోలెడంత వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఇలా యూటర్న్ తీసుకున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లబోతూ ఉన్నారు. అక్కడ తన పాత దోస్తులకు ఎదురుపడబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. దేశంలో అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించే ఉద్దేశంతో ఉంది మోడీ సర్కారు. అందుకోసం అన్ని పార్టీలతోనూ మళ్లీ సంప్రదింపులు జరపబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా వివిధ పార్టీల అధినేతలతో పాటు చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొన్నటి వరకూ దోస్తులుగా మెలిగిన వారితో చంద్రబాబు నాయుడు ఈ సారి ఢిల్లీ వెళ్లినప్పుడు ఎలా వ్యవహరిస్తారో!