Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ ను పిలిచిన‌ట్లే.. కేసీఆర్‌ను పిలవ‌చ్చుగా..?

By:  Tupaki Desk   |   12 July 2015 5:38 PM GMT
గ‌వ‌ర్న‌ర్ ను పిలిచిన‌ట్లే.. కేసీఆర్‌ను పిలవ‌చ్చుగా..?
X
ఆశ‌కు అంతు ఉండాలి.. అనుకోవ‌టానికి ఒక ప‌రిధి ఉండాలి.. లాంటి మాట‌లు అనుకోవ‌చ్చు. కానీ.. సాపేక్షంగా ఆలోచిస్తే.. రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. నిజానికి.. తెలుగు త‌మ్ముళ్లు క‌నుక నోరు విప్ప‌కుంటే.. అస‌లు ఈ వాద‌న తెర మీద‌కు వ‌చ్చేది కాదు.
ఎందుకంటే.. గోదావ‌రి పుష్క‌రాల‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను తాము ఆహ్వానిస్తామ‌ని.. ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటుగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి కూడా ఆహ్వానం ఉంటుంద‌ని ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు పేర్కొన్నారు. ఇక‌.. గోదావ‌రి పుష్క‌రాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ అయిన న‌ర‌సింహ‌న్‌ను ఆహ్వానించారు. చంద్ర‌బాబు స్వ‌యంగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి మ‌రి పిలిచారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను సైతం అదే రీతిలో ఎందుకు ఆహ్వానం ప‌ల‌క‌కూడ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇంట్లో శుభ‌కార్యం జ‌రిగితే.. కోప‌తాపాలు.. ఆగ్ర‌హాల్ని.. విరోధాల్ని ప‌క్క‌న ప‌డేసి.. మాట‌ల్లేని వారి ఇంటికి వెళ్లి మ‌రీ ఆహ్వానించ‌టం తెలుగు లోగిళ్ల‌లో జ‌రిగేదే.

మ‌రి.. అలాంటి ప‌నే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎందుకు చేయ‌కూడ‌ద‌న్న‌ది వాద‌న‌. మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు వెళ్లి మ‌రీ ఆహ్వానం పంపించ‌రుగా అన్న మాట అడగొచ్చు కానీ.. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌లో నిత్యం ఉంటూ.. ఎవ‌రో ఒక‌రి చేత ఆహ్వానం పంప‌టం స‌మంజ‌సం కాద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మాటల్లేని ప‌రిస్థితి నుంచి.. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూర్చొని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం క‌స‌ర‌త్తు చేయాల్సిన నేప‌థ్యంలో.. గోదావ‌రి పుష్క‌రాల కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు వెళితే త‌ప్పేం కాదన్న మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సోద‌ర బంధం ఉండాల‌ని భావించే వారు ఇలాంటివి అనుకోవ‌చ్చు కానీ.. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌తీకార రాజ‌కీయాల్లో ఇలాంటి ఆహ్వానాల‌కు ఏ మాత్రం అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది.