Begin typing your search above and press return to search.

ఆ ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు: చ‌ంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   2 Oct 2015 4:33 PM GMT
ఆ ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు: చ‌ంద్ర‌బాబు
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం గుంటూరులో జ‌రిగిన స్వ‌చ్ఛ ఏపీ మిష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న విద్యార్థుల‌తో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. మంచి కార్య‌క్ర‌మాల‌తో ముందుకు దూసుకు వెళుతున్న త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. రాష్ర్టంలో త‌ప్పుడు స‌మాచారంతో ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేసేవారికి ప్ర‌జ‌లు మ‌ద్దతు ఇస్తే రాష్ర్టాభివృద్ధి ఆగిపోతుంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కు అందరి భాగస్వామ్యం అవసరమ‌ని...అప్పుడే ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు. విద్యార్థులంద‌రూ సామాజిక‌ బాధ్య‌త‌ను అల‌వ‌ర్చుకోవాల‌ని ఆయ‌న కోరారు. రాష్ర్టంలో 12 జిల్లాల్లో చెత్త ద్వారా విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని...సంవ‌త్స‌రంలోగా వీటి నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తామ‌న్నారు. అలాగే స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తిజ్ఞ చేసిన ప్ర‌తి గ్రామాన్ని తాము ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దుతామ‌ని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 ల‌క్ష‌ల మ‌రుగుదొడ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని...వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిచామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అలాగే ఏపీలో మురుగునీటి ద్వారా భూగర్భజలాలు కలుషితం కాకుండా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

అనంత‌రం సాయంత్రం ఆయ‌న గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. ఎలుక క‌రిచి చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న‌పై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష త‌ర్వాత గుంటూరు ఆసుప‌త్రి అభివృద్ధికి ప‌లువురు దాత‌లు భారీగా విరాళాలు ఇచ్చారు. నాట్కో ఫార్మా రూ.కోటి, ఎల్‌వీఆర్ క్ల‌బ్ రూ.10 ల‌క్ష‌లు, సంగం డెయిరీ రూ.10 ల‌క్ష‌లు, రైస్ మిల‌ర్ల సంఘం రూ.10 ల‌క్ష‌ల చెక్కుల‌ను చంద్ర‌బాబుకు విరాళం అందించాయి.