Begin typing your search above and press return to search.

బాబు మాటలతో మైలేజీ తర్వాత..బోలెడంత డ్యామేజీ

By:  Tupaki Desk   |   11 Oct 2019 6:15 AM GMT
బాబు మాటలతో మైలేజీ తర్వాత..బోలెడంత డ్యామేజీ
X
తిరిగే కాలు.. తిట్టే నోరు ఆగదని ఊరికే అనలేదేమో. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఇప్పుడు ఇలానే ఉంది. అధికారం చేజారటం రాజకీయాల్లో మామూలే అయినా.. 23 సీట్లకు పరిమితం చేసి.. లాగి పెట్టి ఒక్కటి పీకినట్లుగా ఏపీ ప్రజలు ఎన్నికల తీర్పు ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఎలా వ్యవహరించాలి? అన్న విషయంలో బాబుకు ఇంకా క్లారిటీ లేనట్లుగా కనిపిస్తోంది.

మీద పడిన వయసుతో ఆయనలో బుద్ధి కుశలత లోపించిందా? అన్న సందేహం కలిగేలా ఆయన తీరు ఉంటోందని చెప్పాలి. చారిత్రక విజయాన్ని అందించిన పార్టీ.. తన పాలనను షురూ చేసి ఇంకా వంద రోజులు కూడా కాని వేళ.. అదే పనిగా రోజుకు రెండు ప్రెస్ మీట్లో.. ప్రెస్ నోట్లో వదులుతూ మీడియాలో కనిపించాలన్న తహతహ చూస్తే.. బాబు మారరా? అన్న సందేహం కలుగక మానదు.

మీ అవసరం మాకు లేదని ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా జనం కోసం తపిస్తున్నట్లుగా వెంట పడటం.. ఇష్యూలను అదే పనిగా ప్రస్తావించటం లాంటివి ప్రజల పక్షాన పోరాడినట్లు కాకుండా.. ప్రభుత్వ పాలనకు అడ్డుపడేలా ఉంటాయన్న భావన కలగటం ఖాయం. ఒక రాజకీయ అధినేత జీవితంలో ఎత్తు పల్లాలు.. గెలుపోటములు సహజం. ప్రజలకు మొహం మొత్తినప్పుడు ఎలా అయితే తిరస్కరిస్తారో.. అవసరమైనప్పుడు అక్కున చేర్చుకుంటారు.

ఎన్నికల్లో ఇచ్చిన తీర్పుతో.. రానున్న ఐదేళ్లలో తమను పాలించాల్సిందిగా జగన్ కు అవకాశం ఇచ్చారు. ఎంతో ఆశతో తామిచ్చిన అవకాశాన్ని జగన్ ఏ మేరకు వినియోగించుకున్నారన్న విషయంపై ప్రజలకు ఒక అభిప్రాయం కలగటానికి తక్కువలో తక్కువ ఏడాది పడుతుంది. అంటే.. కనీసం ఏడాది పాటు మాట మాట్లాడకుండా ఉండటమే కాదు.. అరే.. చంద్రబాబు ఎక్కడికి వెళ్లిపోయారు? ఏమైపోయారు? ఆయన అసలు మాట్లాడటం లేదే? అన్న భావన కలిగేలా చేయాలి.

అలా కాకుండా.. అదే పనిగా ప్రభుత్వాన్ని తప్పు పట్టటమే పనిగా పెట్టుకుంటే.. మాకొద్దు మొర్రో అని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ వెంటపడటం మానడా? అని ఛీదరించుకోవటం ఖాయం. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఇలానే ఉంది. ఒకరి చేతికి అధికారం ఇచ్చిన తర్వాత.. వ్యవస్థల్ని తనకు తగ్గట్లుగా మార్చుకొని.. పని ప్రారంభించటానికి తక్కువలో తక్కువ ఏడాది పడుతుంది.

పాలన మొదలైన మొదటి నుంచే మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించాలని ఆశించటం అత్యాశే అవుతుంది. ఇప్పుడు బాబులో ఇదే గుణం కనిపిస్తుంది. ఈ కారణంతోనే విపక్ష నేతగా మాట్లాడినప్పుడు రావాల్సిన మైలేజీ రాకపోగా.. అదే పనిగా మాట్లాడటం కారణంగా ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ అంతకంతకూ ఎక్కువ అవుతోందన్న చేదు నిజాన్ని బాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు. మరి.. ఈ విషయాన్ని బాబు ఎప్పుడు గుర్తిస్తారో?