Begin typing your search above and press return to search.

జగన్ పేరెత్తకుండా పోరాడలేరా బాబూ!

By:  Tupaki Desk   |   14 Feb 2018 6:40 AM GMT
జగన్ పేరెత్తకుండా పోరాడలేరా బాబూ!
X
ప్రస్తుతం రాజకీయ పరిణామాలు గమనిస్తున్న సామాన్య ప్రజలకు ఓ పెద్ద సందేహం కలుగుతోంది. రాష్ట్రానికి న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ అంటోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ అంటోంది.. కాంగ్రెస్ కూడా అంటోంది.. కేంద్రం రాష్ట్రానికి సాయం చేయాలి అనే విషయంలో వీరెవ్వరి భావజాలంలోనూ మార్పులేదు. విభజన చట్టాన్ని అమలు చేయాలనే విషయంలో వీరెవ్వరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. మరి.. ఈ పార్టీలు వీరిలో వీరు కుమ్ములాడుకుంటున్నారు ఎందుకు? అందరూ కలిసి పోరాడితే.. అద్భుత ఫలితాలు రావడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వీరికి సఖ్యత లేదు.. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి కావాలి.. ఓకే! అంతవరకు ఓకే గానీ.. ఒకరి పోరాటాన్ని మరొకరు కించపరుచుకుంటూ ఉంటే ఎలాగ? ఇలాంటి అసహ్యకరమైన నేలబారు రాజకీయాల వల్ల అసలు కేంద్రం దృష్టిలో ఎవ్వరి పోరాటానికీ విలువ లేకుండా పోతుంది కదా? అని ప్రజలు అనుకుంటున్నారు.

ఆ మాటకొస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంచెం బెటర్ గా వ్యవహరిస్తోందని అనుకోవాలి. ఎందుకంటే.. వారు తెలుగుదేశం మీద చేస్తున్న విమర్శలు రెండు మాత్రమే. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో.. మౌనం పాటించి సహకరించడం.. హోదా అనే అంశాన్ని అసలు ప్రస్తావించకుండా ప్రజల్ని మోసం చేయడం. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ సంఖ్యాపరంగా తమ ఎంపీలు తక్కువే అయినా.. పోరాటాన్ని మాత్రం పెద్దగానే చేస్తోంది.

ఇప్పుడైతే వైసీపీ చాలా క్లియర్ గా ఉంది. వారు కేవలం తమ పోరాటం మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తమ పోరాటానికి స్పష్టమైన రూట్ మ్యాప్ ను డిజైన్ చేసుకున్నారు. స్పష్టమైన డెడ్ లైన్ లు పెట్టుకున్నారు. అంత క్లారిటీతో ప్రతిపక్షం పోరాటానికి దిగడం అనేది అధికార తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఆడనివ్వడం లేదు. తెలుగుదేశం తాము పోరాడినట్లుగా కనిపించాలని ఆరాటపడుతోంది. అదే సమయంలో కేంద్రంనుంచి ఒక్కరూపాయి దక్కినా కూడా క్రెడిట్ మొత్తం తమకే రావాలని అనుకుంటోంది. అదే సమయంలో.. జగన్ మీద బురద చల్లడానికి తంటాలు పడుతోంది. జగన్ రాజీనామాలను సైతం ప్రకటించి.. స్పష్టమైన ఎజెండాతో పోరాడుతోంటే.. జగన్ పార్టీలాగా మనం లొంగిపోనక్కర్లేదని, ఎంతవరకైనా పోరాడుదాం అని చంద్రబాబు అనడం అంటే చవకబారు రాజకీయమే అని ప్రజలు అనుకుంటున్నారు. తమలో తాము ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటే.. ఎవ్వరి పోరాటానికి విలువ లేకుండాపోతుందని.. ప్రజలు హెచ్చరిస్తున్నారు.