Begin typing your search above and press return to search.

2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేయనట్లే..

By:  Tupaki Desk   |   12 April 2017 6:45 AM GMT
2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేయనట్లే..
X
ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించుతారని.. పవన్ పై ఆయన్ను పోటీ చేయిస్తారని, పవన్ ప్రభావాన్ని తట్టుకోవడానికి జూనియర్ సాయం తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతోంది. నిజానికి చంద్రబాబుతో - టీడీపీతో ఎన్టీఆర్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ కూడా చంద్రబాబుకు ఇప్పుడు పవన్ భయం పట్టుకోవడం వల్ల ఒకటి కాదు పది మెట్లు కిందకు దిగి ఎన్టీఆర్ సాయం తీసుకోవడానికి రెడీ అవుతునత్నారన్న ప్రచారం ఒకటి రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. ఈ ప్రచారాన్ని, 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో యాక్టివ్ కావాలన్న కోరికనూ రెండిటినీ ఎన్టీఆర్ వర్గం ఖండిస్తోంది. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు దీన్ని కొట్టిపారేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగి సినిమాలపైనే దృష్టి పెట్టారని ... 2019 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వేలేమీ పెట్టరని తేల్చి చెప్పేశారు.

ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒక్క బాలకృష్ణతో తప్ప చంద్రబాబుకు ఎవరితోనూ మంచి సంబంధాలు లేవిప్పుడు. బాలయ్య వియ్యంకుడు కావడం... చంద్రబాబుకు ఏమాత్రం ఎదురు తిరిగే నైజం లేకపోవడంతో ఆయనతో సంబంధాలు కొనసాగుతున్నాయి. మిగతా బంధువులతో ఏమీ సంబంధాలు లేవు. ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న హరికృష్ణను పూర్తిగా దూరం పెట్టారు. హ‌రికృష్ణ‌తో పాటే జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా పార్టీకి, చంద్రబాబుకు దూర‌మైపోయారు. కానీ... మారుతున్న సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు వారిని దువ్వుతున్నారట. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం... పవన్ రూపంలో ఛరిష్మాటిక్ లీడర్ ప్రత్యర్థిగా వస్తుండడంతో ఆ ఛరిష్మాను బ్యాలన్సు చేయడానికి బాలయ్య ఏమాత్రం చాలడన్న సత్యం చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఎన్టీఆర్ ఇమేజిని వాడుకోవాలన్నది ఆయన ప్లానుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆ ఇద్ద‌రినీ క‌లిపేసుకునే దిశ‌గా పావులు క‌దుపుతున్నారని టాక్. జూనియ‌ర్ ఎన్టీఆర్ తో విభేధాలు ప‌రిష్క‌రించుకునేందుకు హ‌రికృష్ణ‌ను పావుగా ఉపయోగిస్తూ ఆయనకు మళ్లీ ప్రాధాన్యం పెంచుతున్నారంటున్నారు.

2009 ఎన్నిక‌ల్లో జూనియర్ తెదేపాకి ప్ర‌చారం చేశాడు. కానీ 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, లోకేష్ అండ్ కో జూనియ‌ర్‌ని పూర్తిగా దూరం పెట్టేసింది. అత‌డి మాట‌కు ప్రాధాన్యం అన్న‌దే లేకుండా చేసింది. ఆ క్ర‌మంలోనే ఎన్టీఆర్ పార్టీకి దూర‌మైపోయాడు. ఇప్పుడు ఉన్న‌ట్టుండి క‌లిపేసుకోవాల‌ని ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ అందుకు స‌హ‌క‌రిస్తాడా? దూరంగా ఉండేందుకు అత‌డి వ్యూహం అత‌డికి ఉంద‌ని అంటున్నారు. పైగా నారా లోకేష్ ప్రాధాన్యం పార్టీలో పెరగడంతో అస్సలు ఇమిడే పరిస్థితి లేదు. దీంతో ఎన్టీఆర్ ఇక పూర్తిగా సినిమా కెరీర్‌ పైనే దృష్టి సారించాల‌నుకుంటున్నారు. రాజ‌కీయాల‌కు పూర్తి దూరంగా ఉండాల‌నుకుంటున్నార‌ని ఎన్టీఆర్‌ స‌న్నిహితుల ద్వారా తెలిసింది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వివాదాలు కొని తెచ్చుకునే ఉద్దేశం ఎన్టీఆర్ కు లేదని చెబుతున్నారు. అంతేకాదు.. పవన్ పై పోటీ చేయడం.. ప్రచారం చేయడం వల్ల ఒక వర్గం అభిమానులను దూరం చేసుకునే ప్రమాదముందని.. దానివల్ల అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు కాకుండా పోతానని ఎన్టీఆర్ అన్నట్లు కూడా చెబుతున్నారు. ఈ లెక్కన చంద్రబాబు కోరిక ఎన్టీఆర్ తీర్చేలా కనబడడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/