Begin typing your search above and press return to search.

బంగారు 'బాబు' విపరీత ధోరణి వెనుక... ?

By:  Tupaki Desk   |   30 Nov 2017 6:56 AM GMT
బంగారు బాబు విపరీత ధోరణి వెనుక... ?
X
‘‘హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసింది నేనే. నగర అభివృద్ధిలో నాముద్ర చెరగనిది. ఎంతో అభివృద్ధి చేశానన్న తృప్తి నాకు మిగిలింది.’’ ఇవి చంద్రబాబు నాయుడు తాజాగా జీఈఎస్ సదస్సు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. ఈ తరహా వ్యాఖ్యలు ఆయన దాదాపు ప్రతి రోజూ చేస్తూనే ఉంటారు. అవినీతికి వ్యతిరేకంగామాట్లాడతారు. రాజకీయాల్లో నైతిక విలువల గురించి ప్రబోధ చేస్తుంటారు. అభివృద్ధి కాముకునిగా తనకు తాను చెప్పుకొస్తుంటారు. రైతుల సంక్షేమం వ్యవసాయాభివృద్ధి నీటిపారుదల రంగం - పారిశ్రామీకీకరణ - యువతకు ఉద్యోగాలు - ఉపాధి - ఇలా ఒకేటిమిటి ప్రతి రంగంలోనూ ఆయన వివరించి వివరించి పరితపించిపోతున్నట్లు మైక్ కనిపించగానే కలవరిస్తుంటారు. ఇటీవల కాలంలో సాగునీటి రంగం గురించిఆయన పదే పదే ఎక్కువగా చెబుతుంటారు.

ఈ ప్రకటన నేపథ్యంలోనే ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా అమరావతి నుంచి వంత పాడే విధంగా కథనాలు ప్రచురించింది. జీఈఎస్‌ సదస్సు విశాఖలో జరపాలని నిర్ణయించారని అయితే అక్కడ వసతి సదుపాయాలు లేనందున హైదరాబాద్‌ కు తరలిపోయిందని ఆ కథనం సారాంశం.

దీనిని బట్టి జీఈఎస్‌ సదుస్సు హైదరాబాద్‌ లో జరగటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు - ఆయనకు మద్దతు ఇచ్చే మీడియాకు అంతగా రుచించినట్టు లేదు. దీనిని అణుచుకోలేకలేక బాబు వైఫల్యం ఆంధ్ర ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడకుండా ఉండేందుకు తెరమీదకు ఆ వార్తతో పాటు ఆయన వ్యాఖ్యలు తీసుకువచ్చారు. అదే సమయంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో దేశంలో ఏపి ప్రథమ స్థానంలో ఉందనే ప్రకటనలు పత్రికల్లో వేయించుకున్నారు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్నదే.

చంద్రబాబు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక విధంగా చెప్పాంటే రాజకీయాల్లో ఓ విధమైన విపరీత ధోరణిగా విశ్లేషించవచ్చు. కానీ ఆయన ప్రవర్తన - మాటల్లో ఎక్కడా విపరీత ధోరణిగా కనిపించదు.కారణం వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం మనస్సులోంచి చెబుతున్నట్లుగా గొంతు నుంచి మాటలు వస్తుంటాయి.అందువల్లనే అది సహజంగాను కనిపిస్తుంటుంది.

"పోలవరం నిర్మాణం నా జీవిత ఆశయం. పోలవరం - అమరావతి రెండూ నాకు రెండు కళ్లలాంటివి. పోలవరం పూర్తి చేయటం ఒక మహత్భాగ్యం. నా జీవితానికి అదృష్టం. ఎంతో చేయాలనుకుంటున్నాను. అయినా చేస్తూనే ఉన్నాను.’’ ఇది కూడా తరచూ ఆయన చేస్తూనే ఉంటారు.

ఈ విధంగా తరచూ ఆయన చెబుతుండటం వెనక రాజకీయకారణాలు లేకపోలేదు. చరిత్రను తనదైన శైలిలో రాజకీయకోణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ రాసేందుకు ప్రయత్నించే పనిలోభాగంగా ఆయన ఆ విధంగా ఉటంకిస్తుండటం పరిపాటిఅయ్యింది. కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది ఒక్కప్పటి నానుడి. అదే తరహాలో తనదైన శైలిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఆయన మాత్రమే నిజాయితీ - నీతి - నిబద్ధతతకు నిలువుటద్దం. అభివృద్ధి - ప్రగతి కాంక్షించే ఏకైక సమకాలీన నాయకుడు. భవిష్యత్‌ దార్శనికునిగా తనంతటతాను చెప్పుకుంటారు. ఇలా చెప్పుకోవటం వెనుక బలమైనకారణం లేకపోలేదు. ఎందుకంటే ఒక అబద్దాన్ని పదే పదే చెబితే అదే నిజమైపోతుంది. ఒక నిజాన్ని పదే పదే వక్రీకరిస్తే అదే కనుమరుగైపోతుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఈ రెండు పనులూ చేస్తున్నారు. ఓ వైపు నిజాన్ని దాచివేయటం. మరోవైపు అపద్దాన్ని మసిపూసి మారేడుకాయ చేయటం. ఈ విధంగా చేయటం ద్వారానే ప్రజల మనసుల్లో - మదిలో ఘాడంగా తనగురించి ముద్ర వేసుకునేలా చేసి భవిష్యత్‌ తరాలకు ఆదర్శనేతగా నిలిచిపోయి ప్రస్తుత తరుణంలో రాజకీయంగా లాభపడాలనేది ఆయన ఉద్దేశ్యం. అందుకే అబద్దాలను నిజాలుగా వల్లించటం ఆయన ప్రత్యేకత. ఆయన రోజూ ఎన్ని ప్రసంగాలైన ఇస్తారు. ప్రతీసారి గంటల తరబడి మాట్లాడగలరు. అయితే అవన్నీ మనస్సులోంచి వచ్చినట్లే ఉంటాయి. మొత్తం విషయం ఒకటే కానీ ప్రతీసారి కొత్తగా మాట్లాడినట్టు కొత్తదనంతో మాట్లాడినట్టు ఉంటుంది. అది ఆయన గొప్పతనం. ఓ విధమైన కళ కూడా. అందుకే ప్రజలను సులభంగా నమ్మించగలుగుతున్నారా?

హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందని చెప్పుకోవటానికి తాజాగా హైటెక్‌ సిటీని ఉదహరించటంతో పాటు మెట్రోరైల్ ప్రతిపాదన - జీడీఎస్‌ సదస్సు జరుగుతోన్న హెచ్‌ ఐసీసీ మొదలైనవన్నీ తన కాలంలో చేపట్టినవేనని చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా ఆయన వ్యాఖ్యలు విన్నవారు - చదివిన వారు కొత్తవారైతే ఆయన వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమయ్యిందనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి ఈవిధమైన అభివృద్ధి నమూనాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఉపాధి అవకాశాలు మెరుగుపడి మౌలిక వసతులు ఏర్పడినా(అవి ఎవరి సమయంలో అమలైనప్పటికీ) అందులో ప్రైవేటురంగం - పీపీపీ విధానాలు ఉన్నాయి. అవి ఎంతగా విఫలమయ్యాయో - ఎంతగా ప్రయోజనం పొందాయో అదే సమయంలో ఎంత దోపిడీకి దారితీసి అసమానతలకు కారణమయ్యాయో కూడా ఒక పార్శ్వంగా మరచిపోలేము. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తనవల్లనే అభివృద్ధి సాధ్యమయ్యిందనేది చెప్పుకుంటున్నారు. అసలు ఆమాటలకు వస్తే ప్రైవేటు రంగానికి పూర్తిగా ద్వారాలు తెరిచిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ తరువాత మరింత ముందుకు తీసుకువెళ్లిన వాజ్‌ పేయి - ఇంతకింతగా ద్వారాలు తెరిచిన మన్మోహన్‌ సింగ్‌ - ఇప్పటి ప్రధాని మోదీ ఇంకెతంగా ఢంకా భజాయించుకుని తామే అభివృద్ధి చోదకులమని చెప్పుకోవాలి? అసలు హైదరాబాద్‌ అభివృద్ధి అంటే హైటెక్‌ సిటీ - మెట్రోరైలు - హెచ్‌ ఐసీసీ (అవి చంద్రబాబు నాయుడే చేశాడనుకుంటే) లు మాత్రమేనా? వీటి ద్వారానే జంట నగరాలు మొత్తం సుభిక్షం అయిపోయాయా? వీటికి చంద్రబాబు సమాధానం చెప్పరు. చెప్పలేరు. ఎందుకంటే అభివృద్ధిలో ఆయన పాత్ర అత్యంత స్వల్పమే. ఇది వివక్షతో చెప్పేది కానే కాదు. అభివృద్ధి అనేది ఒక దశాబ్దంలో సాధ్యమయ్యేది కాదు. ఒక దశాబ్ద కాలంలో పునాదులు కూడా పడవు. యూరప్‌ - అమెరికా దేశాల అభివృద్ధిని అంగీకరించినా - చైనా - జపాన్‌ లాంటి దేశాల అభివృద్ధి నమూనాను అంగీకరించినా అవి కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాలుగా సాగిన కృషి ఫలితంగానే చెప్పాలి. అందువల్ల అభివృద్ధి అనేది ఐదుపదేళ్లు అధికారంలో ఉండటం ద్వారా చంద్రబాబునాయుడో - రాజశేఖర్‌రెడ్డో లేక కేసీఆరో సాధించటం సాధ్యం కానే కాదు. హైదరాబాద్‌ దేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో ఒక భాగం. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనూ - ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ప్రభావం ఉంటుంది. అంతేకాని ఒక ముఖ్యమంత్రి పదేళ్లలో ప్రగతి రూపు రేఖలను శిల్పం చెక్కినట్లు చెక్కటం సాధ్యంకాదు. మహా అయితే మంచి రహదారులు వేయవచ్చు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు - హైటెక్‌ సిటీ లాంటి - లేదా హెచ్‌ ఐసీసీ లాంటి భవనాలు - లేక మెట్రోరైలు లాంటి ప్రతిపాదనలు తెరమీదకు తీసుకురావచ్చు. ఇవి మాత్రమే అభివృద్ధి కాదు.

నిజానికి తన కాలంలోనే ఐటీ అభివృద్ధి అయ్యిందని తానే హైటెక్‌ సిటీని తీసుకు వచ్చానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటారు. మరి అది నిజమైతే ఆంధ్రప్రదేశ్‌ లో అటువంటి హైటెక్‌ సిటీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం విజయవాడ - విశాఖ లాంటి నగరాల్లోనూ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా ఒక ఉపాధి ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. ఆ క్రమంలోనే బెంగళూరు - చెన్నై - మైసూరు - హైదరాబాద్‌ - పూనె లాంటి పలు నగరాలు ఐటీకి కేంద్రంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కన్నా ఇప్పటి తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ కన్నా బెంగళూరు ఐటీలో అప్పటికీ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. అలాగని ఆ రాష్ట్రాన్ని (కర్ణాటక) పరిపాలించిన - లేదా ఇప్పుడు పాలిస్తున్న ముఖ్యమంత్రలెవరూ తమ వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పుకోవటం లేదు. ఎందువల్ల అంటే అది కొంతకాలం పాటు ముందుకు వచ్చిన ఉపాధి నమూనా.

కానీ చంద్రబాబునాయుడుకు ఇవేవీ పట్టవు. తనవల్లే అభివృద్ధిసాధ్యమైందని, తాను మాత్రమే అభివృద్ధి కాముకుడినని భవిష్యత్తు దిశ - దశ - మార్గనిర్దేశం చేయగలిగిన మహోన్నత నేతగా చెప్పుకుంటుంటారు. అందుకు కారణం ప్రజలపై ఆ విధమైన ముద్రవేసి అభిప్రాయం రుద్దడం ద్వారా తనకు తాను చరిత్రను లిఖించుకోవానేది ఆయన లోతైన ఆలోచన.

-విఎస్