Begin typing your search above and press return to search.

ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ప్లానిదీ..

By:  Tupaki Desk   |   10 July 2018 4:30 PM GMT
ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ప్లానిదీ..
X
ఏపీ రాజకీయాలు ఎన్నికలకు ఏడాది ముందునుంచే వేడెక్కి పోయాయి. ఏ పార్టీ కూడా ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా ప్రజల ముందుకు వెళ్లాలని.. తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవాలని.. ఇతర పార్టీలను ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలూ ఏదో ఒక దీక్ష పేరుతోనో, యాత్ర పేరుతోనో జనంలోకి వెళ్తున్నారు. దీంతో తమకంటూ ప్రత్యేకంగా ఏదో ఒకటి ఉండాలని.. తమను ప్రజలు అర్థం చేసుకోవాలని - గుర్తించాలని భావిస్తున్న టీడీపీ వ్యూహం మారుస్తోంది. రాజకీయ పోరాటం చేస్తూనే దానికి తోడుగా న్యాయ పోరాటాలు చేస్తూ ఆ విషయం ప్రజలకు తెలియజెప్పాలని తలపోస్తోంది.

గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉన్నా పార్టీ పెద్దలు స్వయంగా ప్రజల్లోకి వెళ్లలేకపోవడం టీడీపీకి జనసేన - వైసీపీలతో పోల్చితే మైనస్ అవుతోంది. జగన్ ఎండనక వాననక నడుస్తూ ఇప్పటికే 2500 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసి జనంతో మమేకం అవుతుండడం.. ఆయన ప్రసంగాలకు, యాత్రకు విపరీతమైన ఆదరణ వస్తుండడం తెలిసిందే. ఇక పవన్ కూడా తన ఇమేజ్ తో ప్రజలను ఆకర్షించగలుగుతున్నారు. ఎటొచ్చీ టీడీపీలోనే చంద్రబాబు కానీ - లోకేశ్ కానీ జనంలోకి వెళ్లి అలా కష్టపడలేకపోతున్నారు. ఎంతసేపూ ఊకదంపుడు ఉపన్యాసాలే ఇస్తుండడంతో అవి వర్కవుట్ కావడం లేదు. దీంతో బీజేపీని బూచిగా చూపి న్యాయపోరాటానికి రెడీ అవుతోంది టీడీపీ.

ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఇప్పటికే విలన్ ముద్ర వేయించుకున్న బీజేపీని మరింత టార్గెట్ చేసి తాము లబ్ధి పొందేలా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల సుప్రీం కోర్టులో ఏపీ కి పునర్విభజన చట్టం ప్రకారం అన్నీ చేసేశామంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిని రాజకీయాస్త్రంగా మలచుకోవడానికి రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఆర్థికశాఖ, హోం శాఖ దాఖలు చేసిన అఫిడవిట్లను తప్పుల తడకగా రాష్ట్రప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. రెవిన్యూ లోటు భర్తీ విషయంలో చోటు చేసుకున్న అంతరాలపై కౌంటర్ అఫిడవిట్ ఇవ్వబోతోంది. అదే సమయంలో హోంశాఖ విభజన సమస్యలను పరిష్కరించకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు - ఆస్తుల విషయంలో స్పష్టత లేకపోవడం వంటి ప్రధాన అంశాలను న్యాయస్థానం దృష్టిలో పెట్టాలని యోచిస్తున్నారు. సుప్రీం కోర్టులో వ్యాజ్యం పేరిట ఆయా అంశాలను ప్రజల దృష్టిలో సజీవంగా ఉంచాలనేది టీడీపీ ఎత్తుగడగా తెలుస్తోంది.

మరోవైపు ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనుండడంతో దిల్లీ కేంద్రంగా మరోసారి స్పీడు పెంచాలని టీడీపీ భావిస్తోంది. పార్లమెంటు సమావేశాల కాలంలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నారు. దీంతో పార్లమెంటులో సభలను అడ్డుకుంటూ బీజేపీని ఎండగట్టడం.. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలోనూ టీడీపీ చేసిన పనులు చెప్పుకొంటూ ప్రచారం చేసుకోవడం అనే లక్ష్యంతో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. ఆగస్టు పదిహేను తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రజాభాగస్వామ్యంతో ఎమ్మెల్యేలు పోరాటాలు చేయాలని టీడీపీ అగ్రనాయకత్వం నిర్దేశించింది. మొత్తానికి అన్ని వైపుల నుంచి నరుక్కొచ్చి ఎన్నికల నాటికి మైలేజి పెంచుకోవాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది.