Begin typing your search above and press return to search.

మందును కారం అనుకునే బాబును ఏమనాలి?

By:  Tupaki Desk   |   10 Sep 2016 4:27 AM GMT
మందును కారం అనుకునే బాబును ఏమనాలి?
X
దెబ్బలు తగిలాయి. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దెబ్బకొట్టింది. గాయమైంది. తెలుగు ప్రజల గుండెకు గాయమైంది. వారి నమ్మకానికి గాయమైంది. మంచి చేస్తారని పెట్టుకున్న విశ్వాసానికి గాయమైంది. అవును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలకు దారుణంగా గాయాలయ్యాయి గనుకనే.. వాటికి మందుపూసి.. ఆ గాయాల్ని నయం చేసే ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడు ప్రజాందోళనల రూపంలో మన నిరసనను కేంద్రానికి తెలియజేయడానికి విపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రయత్నం అదే! అయితే చంద్రబాబు ఇప్పటికీ తన నాటకాన్ని ముగించడం లేదు. గాయాలకు మందుపూయడానికి , ఆ గాయాలను నయం చేయడానికి వైకాపా ప్రయత్నిస్తూ ఉంటే, చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని, రాష్ట్ర బంద్‌ చేయడాన్ని గాయాల మీద కారం రాయడం లాగా అభివర్ణిస్తున్నారు అని జనం భావిస్తున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు ఇచ్చిన బంద్‌ను అధికార తెలుగుదేశం వ్యతిరేకించడం అనేది ప్రజలకు జీర్ణం కావడం లేదు. కేంద్రంలో అధికారం పంచుకుంటున్న కూటమిలో భాగస్వామిగా ఉన్నది గనుక.. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే దమ్ము తెలుగుదేశానికి ఉండకపోవచ్చు గానీ.. ఆ పని చేస్తున్న విపక్షాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం, ప్రజల్లో ఉన్న స్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నం ఏరకంగా సబబు అని జనం అనుకుంటున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ శనివారం రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంద్‌ కు పలు ప్రాంతాల్లో వ్యాపారులు - ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత వంటివి ప్రకటించి.. బంద్‌ కు సహకరిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఇంత అపూర్వంగా ఉంటే ప్రభుత్వం మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వేలమంది పోలీసుల్ని మోహరించి - ఉద్యమకారుల్ని అరెస్టులు చేయిస్తోంది. జైట్లీ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి అయిన గాయాలకు ఈ బంద్‌ అనేది మందుపూసే ప్రయత్నం అని చంద్రబాబు తెలుసుకోవాలని, ఇది కారం అనే భావనను ఆయన వదులుకోవాలని ప్రజలు కోరుతున్నారు.