Begin typing your search above and press return to search.

పట్టుమని పది మంది లేరు..వారంలో ఒక రోజేంటి బాబు?

By:  Tupaki Desk   |   9 Sep 2019 5:08 AM GMT
పట్టుమని పది మంది లేరు..వారంలో ఒక రోజేంటి బాబు?
X
మాంచి స్పీడ్ లో వెళుతున్నప్పుడు ఎదురుదెబ్బ తగిలిందనుకోండి. ఏం చేస్తారు? చాలామంది పెద్దగా పట్టించుకోరు. కొంతమంది ఏమిటిలా? అంటూ డౌట్ పడతారు. మరింత జాగ్రత్తపడే వారు మాత్రం.. ఇలాంటి ఎదురుదెబ్బల వెనుక అసలేమైంది? ఇలాంటివి మరోసారి జరగకుండా చేయాలంటే ఏం చేయాలన్న ఆలోచనలో పడతారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మొదటి కోవకు చెందుతారు.

వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కూడా తత్త్వం బోధ పడకపోగా.. అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చి.. విషయాన్ని మరింత కంగాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్పించి.. వాస్తవాన్ని ఇప్పటికి గుర్తించటం లేదన్న మాట వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చెలరేగిపోయిన ఆయన.. మరోసారి తన చేతికి పవర్ ఖాయమని భావించటం తెలిసిందే. అయితే.. అందుకు భిన్నంగా షాకింగ్ రిజల్ట్ ఎదురైంది.

ఓటమి వచ్చినంతనే అప్పటివరకూ తన చుట్టూ ఉన్న అత్యంత సన్నిహిత నేతలు ఎవరికి వారు.. తమ దారిన తాము చూసుకునే దిశగా అడుగులు వేస్తూ.. పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఉన్నోళ్లలో పలువురు ఏ పార్టీలో తమకు ఎలాంటి అవకాశం లభిస్తుందని ఆశగా ఉన్నారు. ఏపీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. తెలంగాణలో పార్టీ పరిస్థితి మరెలా ఉందో ఆయనకు ఇప్పటికి అర్థం చేసుకోలేకపోతున్నారు.

కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నప్పటికీ.. తొమ్మిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బాబు తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారన్న ఒక్క కారణంతో గులాబీ బాస్ కు భారీ మెజార్టీని ఇచ్చి గెలిపించిన వైనం బాబు మదిలో రిజిస్టర్ కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో బాబునుకానీ.. తెలుగు దేశాన్ని కానీ తమతో రిలేట్ చేసుకోవటానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరన్న విషయాన్ని మర్చిపోతున్న చంద్రబాబు.. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి తన పట్ల మరింత రగిలిపోయేలా చేస్తున్నారని చెప్పాలి.

ఏపీలోనే టీడీపీకి దిక్కు లేదు. అలాంటిది పార్టీలో పట్టుమని పది మంది నేతలు లేని తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ బాబులో ఆశలు చావలేదు. తాను ఏదోరీతిలో చక్రం తిప్పుతానన్న ఆలోచనలో ఉన్న ఆయన.. తాజాగా చేసిన ప్రకటన ఒకటి షాకింగ్ గా మారింది.

తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై బాబు ఫోకస్ పెట్టారట. శనివారం తెలంగాణ టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ జరగ్గా.. ఆదివారం ముఖ్యనేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపి.. వారంలో ఒకరోజు (శనివారం) తెలంగాణకు కేటాయించనున్నట్లు ప్రకటించారు. పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయిన వారి గురించి వదిలేయాలని.. ఉన్నవాళ్లతో ఏం చేద్దామన్నదే ముందున్న కర్తవ్యమని చెప్పటం గమనార్హం.

రానున్న శనివారం నుంచి (సెప్టెంబరు 14) పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష ఉంటుందని.. కార్యకర్తలతో ఆత్మీక కలయిక ఉంటాయని చెబుతున్నారు. అయినా.. ఎవరున్నారని సమీక్షలు.. కలయికలు? బాబు మారరా? వాస్తవాన్ని గుర్తించరా?