Begin typing your search above and press return to search.

అసలు విషయం మరిచినట్లున్నారు బాబు

By:  Tupaki Desk   |   23 May 2016 9:23 AM GMT
అసలు విషయం మరిచినట్లున్నారు బాబు
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఒకింత ఆస‌క్తిని త‌గ్గించుకున్నారా? సొంత పార్టీలోని ప‌రిణామాలు, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో కొన‌సాగుతున్న బంధానికి బీట‌లు వారే పరిస్థితులపై చంద్ర‌బాబు ఎందుకు దృష్టిసారించ‌డం లేదు? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోణంలో ప‌ర్య‌ట‌నలు చేస్తున్న చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల‌ను ఎందుకు దూరం చేస్తున్నారు? ఇది ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని స్ప‌ష్టంగా తెలుసుకునేందుకు చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ రాష్ట్ర రాజకీయాల తీరు మారింది. మిత్రపక్షాలుగా కేంద్రంలోనూ - రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకుంటున్న టీడీపీ-బీజేపీలు పరస్పరం విమర్శల పర్వాన్ని ప్రారంభించాయి. మంత్రులు - సీనియ‌ర్ నేత‌లు కూడా ఈ విమ‌ర్శ‌ల ప‌ర్వంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. కొద్దికాలంగా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో చేసినా దానిని చెప్పకుండా బీజేపీని అపప్రతిష్టకు గురిచేస్తున్నారన్నది వారి వాదన. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కూడా వారు చెబుతున్నారు ఈ విమర్శలపై టీడీపీ రాష్ట్ర మంత్రులు - ఇతర నేతలు విమర్శలు ప్రారంభించారు.

అయితే చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌న్న‌ట్లుగా కేంద్రం మాట్లాడిన నేప‌థ్యంలో తెలుగుదేశం నాయ‌కుల స్పంద‌న మారింది. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ - కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌పై విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని ఎంపీ రాయపాటి బహిరంగంగానే ప్రకటించారు. సీనియర్‌ మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో జరిగిన మిని మహానాడు సాక్షిగా నేరుగా ప్రధాని మోడీపైనే విమర్శలకు దిగారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దొంగాట ఆడుతుందన్న అయ్యన్న - ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విభ‌జ‌న పాపంలో బీజేపీకి వాటా ఉంద‌ని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుపై విమ‌ర్శ‌లు చేశారు.

బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉండ‌టం ద్వారా ఏపీ ప్ర‌యోజ‌నాలు నేర‌వేర్చుకుందామ‌ని ఇటీవ‌లే పార్టీ సీనియ‌ర్ల‌తో జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబు సూచించారు. అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ సీనియ‌ర్లు కామెంట్లు చేస్తుండ‌టం ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తుందోన‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప‌రిపాల‌న‌తో పాటు పార్టీ అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పై సైతం చంద్ర‌బాబు దృష్టిసారించాల‌నే వాద‌న వినిపిస్తోంది.