Begin typing your search above and press return to search.

నెల్లూరుకు బాబే వెళ్ల‌లేక‌పోయారు!

By:  Tupaki Desk   |   18 Nov 2015 9:10 AM GMT
నెల్లూరుకు బాబే వెళ్ల‌లేక‌పోయారు!
X
ఏపీలోని రాయ‌ల‌సీమ‌తో పాటు నెల్లూరు.. గుంటూరు.. కృష్ణా.. గోదావ‌రి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షం భారీగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాల కార‌ణంగా గ‌త నాలుగైదు రోజులుగా జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ 13 మంది మ‌ర‌ణించగా.. వేలాదిమంది నిరాశ్ర‌యులైన ప‌రిస్థితి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక‌.. లోత‌ట్టు ప్రాంతాల ప‌రిస్థితి అయితే మ‌రింత దారుణంగా మారింది.

భారీ వ‌ర్షాల తీవ్ర‌త ఎంత ఎక్కువ‌గా ఉందంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బాధిత ప్రాంతాల్ని చూసేందుకు సైతం వెళ్ల‌లేని ప‌రిస్థితి. ప్ర‌కృతి విప‌త్తులు చోటు చేసుకున్న‌ప్పుడు.. త‌న నిర్వాహ‌ణ సామ‌ర్థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి క‌ష్టం క‌ల‌గ‌కుండా చూసే విష‌యంలో చంద్ర‌బాబుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. హుధూద్ తుఫాను సంద‌ర్భంగా ఆయ‌న‌.. విశాఖ‌ప‌ట్నానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. విశాఖ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసిన హూధూద్ స‌మ‌యంలో విశాఖ‌కు చేరుకోవ‌టానికి ఆయ‌న రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సైతం వెనుకాడ‌లేదు.

అలాంటి చంద్ర‌బాబు.. తాజాగా నెల్లూరు జిల్లాలో వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన ప్రాంతాల్ని ప‌రిశీలించ‌టానికి ప్ర‌య‌త్నించారు. కానీ.. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌టంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం చూస్తే.. దాదాపు 4 ల‌క్ష‌ల ఎక‌రాల్లోని పంట న‌ష్టం వాటిల్లితే.. దాదాపు 950కి.మీ. మేర ర‌హ‌దారులు దెబ్బ తిన్న ప‌రిస్థితి. ఇక‌.. వంద‌లాది చెరువుల‌కు గండ్లు ప‌డితే.. లోత‌ట్లు ప్రాంతాల్లో భారీగా వ‌ర్ష‌పు నీరు చేరుకున్న ప‌రిస్థితి.

వ‌ర్షాల కార‌ణంగా ఇంత భారీ న‌ష్టానికి కార‌ణం.. అతి త‌క్కువ స‌మ‌యంలో అత్య‌ధిక‌వ‌ర్షం కుర‌వ‌ట‌మేన‌ని చెప్పొచ్చు. దీనికి ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే.. నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండ‌లం పోతెగుంట గ్రామ ప‌రిధిలో కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కురిసిన వ‌ర్ష‌పాతం ఏకంగా 39 సెంటీమీట‌ర్లు అంటే వ‌ర్షం తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. ఇలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో భారీగా వ‌ర్షాలు కుర‌వ‌టంతో స‌హాయ కార్యాక్ర‌మాలు అందించేందుకు సైతం క‌ష్టంగా మారింది. ప్ర‌కృతి విప‌త్తుల సమ‌యంలో వెనుకా ముందు చూసుకోకుండా వెళ్లిపోయే చంద్ర‌బాబు సైతం.. బాధిత ప్రాంతాల‌కు వెళ్ల‌లేక‌పోయారంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు.