Begin typing your search above and press return to search.

బాబు కరివేపాకు.. ఈసారి అఖిలప్రియ..

By:  Tupaki Desk   |   5 Jan 2019 10:56 AM IST
బాబు కరివేపాకు.. ఈసారి అఖిలప్రియ..
X
అవసరార్థం నాయకులను - కుటుంబ సభ్యులను వాడుకోవడం.. అవసరం తీరాక వారిని గాలికి వదిలేయడం బాబు గారికి అలవాటని ఎన్నో ఉదాహరణలు చెబుతూనే ఉన్నారు. తాజాగా బాబు గారి కూరలో కరివేపాకుగా మంత్రి అఖిలప్రియ మారిపోయిందని చెప్పకతప్పదు. ప్రస్తుతం ఆమె ఉన్న ఫళంగా తనకు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్లను వెనక్కి పంపడం సంచలనంగా మారింది.

అఖిల ప్రియ తాజా కోపానికి కారణం చంద్రబాబు కర్నూలు జిల్లా బాధ్యతలను మంత్రి ఫరూక్ కు అప్పగించడమే.. ఆయన తాజాగా పోలీసులతో మంత్రి అఖిల ప్రియ అనుచరుల ఇళ్లపై దాడులు చేయించారు. సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లలోనే సోదాలు చేయడం దుమారం రేపింది.

ఈ దాడులపై సీరియస్ అయిన అఖిలప్రియ.. జిల్లాలోని రుద్రవరం మండలం నరసాపురం పర్యటనను వచ్చారు. అక్కడికి వచ్చిన సీఐ - ఎస్ - గన్ మెన్లను సెక్యూరిటీ వద్దంటూ వెనక్కి పంపారు. గన్ మెన్లు లేకుండా గ్రామంలో పర్యటించారు. తన అనుచరులకు భద్రత లేనప్పుడు తనకు ఎందుకంటూ ఈ నిర్ణయం తీసుకున్నానని మీడియాకు తెలిపారు.

మంత్రి ఫరూక్ కు చంద్రబాబు కర్నూలు లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన మంత్రి అయ్యాక అఖిలప్రియ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వీరిద్దరి కుటుంబాల మధ్య పరోక్ష పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి టికెట్ ను ఫరూక్ ఆశిస్తుండగా.. చంద్రబాబు సపోర్టుగా ఉన్నారు. నంద్యాల సీటు భూమా కుటుంబానిది కావడంతో ఇలా బాబు ఫరూక్ చేతే చెక్ పెడుతున్నారు. ఇలా బాబుపై నమ్మకంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అఖిల ప్రియకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారనే చర్చ టీడీపీలో వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో కూరలో కరివేపాకులా అఖిలప్రియను బాబు తీసేశాడని ఆమె కార్యకర్తలు మథనపడుతున్నారట.