Begin typing your search above and press return to search.

ఇంత దుబారా పనికి రాదేమో బాబు

By:  Tupaki Desk   |   19 Jun 2016 4:05 AM GMT
ఇంత దుబారా పనికి రాదేమో బాబు
X
ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దుబారా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. ఇవి ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లుగా కొట్టిపారేయ‌కుండా నిజంగానే నిజం అనేలా కూడా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. కేవలం 26 కిలోమీటర్ల దూరానికి బాబు ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించడం ఈ విమ‌ర్శ‌ల‌కు కార‌ణంగా మారింది.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని తన అధికారిక నివాసం నుంచి చంద్రబాబు స‌మీపంలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి హెలికాప్టర్ లో వెళ్లారు. ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య దూరం కేవ‌లం 26 కిలోమీట‌ర్లేన‌ని...ఈ మాత్రం దానికి హెలీకాప్ట‌ర్ ఎందుక‌ని ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి వ‌స్తున్నారంటే ఎలాగూ ట్రాఫిక్ నిలిపివేస్తారు కాబ‌ట్టి స్వ‌ల్ప స‌మ‌యంలోనే చేరుకునే అవ‌కాశం ఉన్నా కూడా బాబు ఖ‌ర్చుకు పెద్ద పీట వేశార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

గతంలోనూ చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ బాబు దుబారా ఖర్చు రూ.735 కోట్లుగా ప‌లు వ‌ర్గాలు పేర్కొన్నాయి. విదేశీ పర్యటనలు, రాష్ట్రంలోనే జిల్లాల పర్యటనల కోసం విమానాల ఖర్చులు - చంద్రబాబు నివాసాలు - కార్యాలయాల కోసం ఈ మేరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయిన‌ప్ప‌టికీ బాబు త‌న రూటే సెప‌రేటు అన్న‌ట్లుగా ముందుకుపోతున్నార‌ని ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.