Begin typing your search above and press return to search.

పోలవరం.. బాబు ఫ్లాప్ రాజకీయం..

By:  Tupaki Desk   |   3 Nov 2018 8:30 AM GMT
పోలవరం.. బాబు ఫ్లాప్ రాజకీయం..
X
పోలవరం ప్రాజెక్టు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలల రూపం.. జలయజ్ఞం నుంచి పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టును తను అధికారం ఉండే 2014లోపు పూర్తిచేయాలని వైఎస్ భావించారు.. ఆనాడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అనేక ప్రాజెక్టులను పునాది రాళ్లు వేసి.. అనతి కాలంలోనే జలాలను పంట పొలాల బాట పట్టించి రైతు ఇంట సిరులు కురిపించారాయన. కానీ ఆయన మరణానంతరం ప్రాజెక్టుల నిర్మాణం పడకేసింది.. నిధుల కేటాయింపు తగ్గింది. నిర్మాణం నత్తకునడకనేర్పేలా సాగింది. ఇందులో భాగంగా అతిపెద్ద ప్రాజెక్టు పోలవరానికి ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంలా మారింది. కాసుల కోసం జాప్యం చేయడం.. అంచనాలు పెంచేయడం.. దోచేయడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి.

2014 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు - కాషాయం కండువాతో కలిసి సవారీ చేశారు. కమళంతోనే దేశ వికాసం అంటూ ఊదరగొట్టారు. కేంద్రంలో బీజేపీ - రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టాయి. ఇక కేంద్రం నుంచి నిధుల వరద పారుతుందని - ప్రాజెక్టు గేట్లన్నీ తెరుచుకుంటాయని టీడీపీ నేతలు పదే పదే వల్లెవేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో.. ఈ గొప్ప తమేదనంటూ టీడీపీ నేతలు చంకలు గుద్డుకున్నారు. నాలుగేళ్ల తరువాత ఎడముఖం పెడముఖం అయ్యాక - తూచ్.. మోడీ నిధులు ఇవ్వలేదని టీడీపీ నేతలు ప్లేట్ తిప్పారు. పోలవరానికి రాజకీయ గ్రహణం పట్టి ఇప్పటికీ పూర్తికాలేదు. భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ కాగ్ కడిగిపారేసింది.

2019 మే నాటికి పోలవరం నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఇదేంటబ్బా.. మేలో సూరీడు తలమీదకెక్కి సుర్రు సుర్రుమనే కాలం.. పంటలన్నీ ఇంటికి చేరి చేలన్నీ నెర్రెలిచ్చి ఆకాశం వైపు నీటి చుక్క కోసం ఆశగా ఎదురుచూసే కాలం.. మరి మేలో పోలవరం నీళ్లు ఏం చేసుకుంటారనే అనుమానం రాకమానదు. ఇది చంద్రబాబు లాజిక్. గత ఎన్నికల్లో మాదిరిగా ఈ సారి ప్రజలను అబ్రకదబ్ర అంటూ మాయ చేద్దామనుకుంటున్న మ్యాజిక్ పనిచేసేలా కనిపించడం లేదు.. మేలో నీళ్ల ప్రస్తావని ఉండదని, అసలు ఆ సమయానికి పోలవరం పూర్తవదని ఆయనకు తెలుసు. కాబట్టే అలా సెలవిచ్చారు ఆయన. ఇలాంటి జిమ్మిక్కులను ముందుగానే పసిగట్టిన ప్రజలు.. ఈ సారి టీడీపీకి ఓటుతో బుద్దిచెబుతామంటున్నారు. మరి బాబు పోలవరం డ్రామాకు ఈ ఎన్నికలతోనైనా తెరపడుతుందో లేదో చూడాలి మరి..