Begin typing your search above and press return to search.

పుష్కరాల మీద ఇప్పుడా నిద్ర లేచేది బాబు..?

By:  Tupaki Desk   |   26 Jun 2015 4:43 AM GMT
పుష్కరాల మీద ఇప్పుడా నిద్ర లేచేది బాబు..?
X
విభజన జరిగిన తర్వాత.. ఏదైనా అంశం గురించి పోటాపోటీ కానీ.. పోలిక కానీ చూసుకునే పరిస్థితి త్వరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పడనుంది. విభజన పూర్తి అయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే గోదావరి పుష్కరాల మీద స్పందించి.. ఎలా చేయాలన్న అంశంపై నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది ఏపీ సర్కారే.

ఏపీ సర్కారు పని తీరును.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ప్రత్యేకతను చాటి చెప్పే అవకాశం గోదావరి పుష్కరాలు ఇస్తాయని.. తెలుగుదేశం నేతలు చెప్పుకోవటమే కాదు.. తామీ అవకాశాన్ని నూటికి రెండు వందల శాతం వినియోగిస్తామని.. తామేంటో చూపిస్తామని చెప్పుకున్నారు.

చూస్తుండగానే పదమూడు నెలలు జరిగిపోయాయి. పుష్కరాలు రోజుల్లోకి వచ్చేశాయి. ఇలాంటి సమయంలో గోదావరి పుష్కరాల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి..? ఎంతమేరకు పూర్తి అయ్యాయన్న విషయాన్ని పరిశీలించేందుకు.. సమీక్ష జరిపేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షను నిర్వహించటంతో పాటు.. రాజమండ్రికి స్వయంగా వెళ్లారు.

యథావిధిగా పనులు పెద్దగా జరగకపోవటం.. చేయాల్సిన పనులు చాలానే ఉండిపోవటం లాంటివి గమనించి.. అధికారుల్ని సున్నితంగా మందలించారు. పనుల్ని పూర్తి చేయాలని.. బాగా పని చేసిన వారికి అవార్డులు ఇస్తామని ఆయన ఊరించారు.

పదమూడు నెలల విలువైన సమయాన్ని వదిలేసి.. చివరి రోజుల్లో హడావుడిగా పనులు చేయించటం చూసినప్పుడు బాబు పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. పదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం ఉన్న ఒక నేత నేతృత్వంలో పుష్కరాలు లాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనను ఆచరణలో తీసుకురావటంలో వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఓ పక్క కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాల్ని నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతుంటే.. మేం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామన్నట్లుగా ఏపీ సర్కారు వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. ముంగిట్లోకి వచ్చి పడిన గోదావరి పుష్కరాల సమయంలో పనులు పూర్తి కాలేదన్న విషయాన్ని గుర్తించి.. పని బాగా చేస్తే అవార్డులు ఇస్తామని ఊరించటం చూసినప్పుడు చంద్రబాబు వైఫల్యం ఇట్టే తెలిసిపోతుంది.

ఆఖరిలో నిద్ర లేచే కన్నా.. ఒక క్రమపద్ధతిలో నెలకు ఒక రోజు చొప్పున పుష్కరాలకు కేటాయించి.. స్వయంగా పర్యవేక్షించినా.. ఇప్పుడు ఉన్న దాని కంటే మెరుగైన వసతులు ఉండేవేమో. సీమాంధ్ర ప్రజలు బాబు నుంచి కోరుకుంటుందన్నది ఇది కాదేమో అన్న విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుందేమో.