Begin typing your search above and press return to search.

ప్రాజెక్టుల ద‌గ్గ‌ర చంద్ర‌బాబు ప‌డుకుంటారా?

By:  Tupaki Desk   |   9 April 2016 1:22 PM GMT
ప్రాజెక్టుల ద‌గ్గ‌ర చంద్ర‌బాబు ప‌డుకుంటారా?
X
చిత్తూరుజిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప‌నుల్ని ప‌రిశీలించే క్ర‌మంలో ఆయ‌న కాంట్రాక్ట‌ర్ల‌ను హెచ్చ‌రించ‌ట‌మే కాదు.. ప్రాజెక్టుల‌ను స‌కాలంలో పూర్తి చేయ‌ని వారిపై విస్ప‌ష్ట వార్నింగ్ లు ఇచ్చేయ‌టం గ‌మ‌నార్హం. మ‌ద‌న‌ప‌ల్లిలో ఏరియ‌ల్ స‌ర్వే చేసిన ఆయ‌న‌.. జూన్ 31 నాటికి కుప్పం కెనాల్ ప‌నులు.. మే 31 నాటికి పుంగ‌నూరు బ్రాంచ్ కెనాలు ప‌నులు.. 90 రోజుల్లో హంద్రీనావా సొరంగం ప‌నులు చేయాల‌న్న తాజా ల‌క్ష్యాన్ని పెట్టేశారు.

తాను చెప్పిన స‌మ‌యం లోపు ప్రాజెక్టుల్ని పూర్తి చేయ‌ని ప‌క్షంలో.. స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్ట్ లో పెడ‌తాన‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్నారు. అవ‌స‌ర‌మైతే ప్రాజెక్టుల వ‌ద్ద ప‌డుకొని అయినా ప‌నులు పూర్తి చేయిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న ప్రాజెక్టుల‌కు తాజాగా బాబు విధించిన తుది గ‌డువును కాంట్రాక్ట‌ర్లు ఎంత సీరియ‌స్ గా తీసుకుంటారో చూడాలి.

చిత్తూరు జిల్లాలోని స్వ‌ర్ణ‌ముఖి న‌దిలో ప్ర‌యోగాత్మ‌కంగా చెక్ డ్యాం ఏర్పాటు చేయాల‌ని చెప్పిన చంద్ర‌బాబు.. పుట్ట‌ప‌ర్తిలోని స‌త్య‌సాయి ట్ర‌స్ట్ లా తిరుప‌తి అభివృద్ధిపై టీటీడీ బాధ్య‌త తీసుకోవాల‌ని టీటీడీ అధికారుల్ని సూచించారు. అవ‌స‌ర‌మైతే.. ఇందుకు అడ్డంకిగా ఉన్న చ‌ట్టాల్ని మారుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తిరుప‌తి అభివృద్ధి మీద తాజాగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య మీద ఆయ‌న నిల‌బ‌డి ముందుకెళితే.. రానున్న రోజుల్లో పెను మార్పులు చోటు చేసుకోవ‌టం ఖాయం.