Begin typing your search above and press return to search.

40 ఏళ్ల కలను 500 రోజుల్లో పూర్తి చేస్తారట

By:  Tupaki Desk   |   14 Sept 2016 10:10 AM IST
40 ఏళ్ల కలను 500 రోజుల్లో పూర్తి చేస్తారట
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల కలపై కొత్త లక్ష్యాన్ని చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి సీమాంధ్రుడు ఎంతో ఆశగా ఎదురుచూసే ప్రాజెక్టులలో పోలవరం ఒకటి. ఈ భారీ ప్రాజెక్టును సాకారం అవుతుందని నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాలం గడుస్తున్నా.. ప్రాజెక్టు మాత్రం పూర్తి కాని దుస్థితి. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని తేల్చిన వేళ.. ఏపీ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా సా...గుతున్న ఈ ప్రాజెక్టును కేవలం 500 రోజుల్లో పూర్తి చేయాలన్న భారీ లక్ష్యాన్ని అధికారుల ముందు ఉంచారు.

2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు దాదాపు కొన్నినెలల ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అధికారుల ముందు ఉంచారు. దసరా నుంచి కాంక్రీట్ పనులు షురూ చేయాలని.. ఇప్పటివరకూ అనుకున్న పనులు అనుకున్నట్లు జరగలేదని.. ఇకపై అలా కాకుండా రెట్టింపు వేగంతో పనులు పూర్తి చేయాలన్నారు. కొత్తగా తీసుకొచ్చిన భారీ యంత్రాల్ని స్వయంగా నడిపిన చంద్రబాబు.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 మే నాటికి పోలవరం పనులు పూర్తి కావాలన్న లక్ష్యాన్నినిర్దేశించారు.

పోలవరం నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్రమే నిర్వహించాలంటూ కేంద్రం బాధ్యతను అప్పజెప్పిందని.. దీంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై పడిందన్న చంద్రబాబు.. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పనికీ నిర్దేశిత గడువును నిర్ణయించుకొని.. ఏ పనిని ఏ తేదీల నాటికి పూర్తి చేస్తారన్న విషయాన్ని తనకు చెప్పాలంటూ అధికారుల్ని కోరారు. పోలవరంలో మొత్తం 10.49 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ 4.11 కోట్ల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగిందని.. రోజుకు 2.5లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇకపై ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి సోమవారం వర్చువల్ ఇన్ స్పెక్షన్ చేస్తానని.. ప్రతి నెలా మూడో సోమవారం ప్రాజెక్టు వద్దకు రానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

2018 వర్షాకాలం నాటిపి ప్రాజెక్టు పూర్తి కావాలని.. ఇప్పటికి 13సార్లు పోలవరం వచ్చానని.. మరో 24 సార్లురానున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై కొందరు పదే పదే కోర్టులకు వెళుతున్నారని.. విపక్షాలు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని సమీక్షించేందుకు నాలుగు నెలలకు ఒకసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పిన చంద్రబాబు.. అక్కడ సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. వినేందుకు మాటలైతే బాగున్నాయి. మరి.. చేతల్లో చెప్పినవి ఎంతవరకుజరుగుతాయో చూడాలి. నలభై ఏళ్ల కల 500రోజుల్లో పూర్తి కానుందా..?