Begin typing your search above and press return to search.

చంద్రబాబు వర్సెస్ సీఎస్.. రసవత్తర రాజకీయం!

By:  Tupaki Desk   |   26 April 2019 10:03 AM GMT
చంద్రబాబు వర్సెస్ సీఎస్.. రసవత్తర రాజకీయం!
X
సూటిగా చెప్పాలంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు! సాధారణంగా ఒక ముఖ్యమంత్రి సీఎస్ ఇలా మాట్లాడటం, ఇలా వ్యవహరించడం గమనించి ఉండం. సీఎస్ హోదాలో ఉన్న వారెవరైనా ముఖ్యమంత్రి దగ్గర అణిగిమణిగే ఉంటారు. సీఎస్ గా పదవీ కాలం ముగిసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న కొంతమంది తాము పని చేసిన ముఖ్యమంత్రుల మీద దుమ్మెత్తి పోస్తూ ఉండటాన్ని చూస్తూ ఉంటాం. అయితే సీఎస్ గా ఉండగానే సీనియర్ ఐఏఎస్ ఎవరూ ముఖ్యమంత్రి మీద పంచ్ లు వేసినట్టుగా మాట్లాడటం, అధికార పార్టీ మీద హాట్ కామెంట్స్ చేయడం బహుశా ఎప్పుడూ జరిగి ఉండదేమో. ఏపీలో ఇప్పుడు అలాంటిదే జరుగుతూ ఉంది!

సీఎస్ హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం, తెలుగుదేశం పార్టీల మధ్యన ఒక వార్ నడుస్తూ ఉంది. ఎల్వీ సుబ్రమణ్యం ఎలాంటి పరిస్థితుల్లో సీఎస్ గా వచ్చారో అందరికీ తెలిసిందే. ఏపీకి సీఎస్ గా ఉండిన సీనియర్ ఐఏఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేశాకా ఎల్వీ సుబ్రమణ్యం ఆ బాధ్యతల్లోకి వచ్చారు. తీరా పోలింగ్ ముగిశాకా ఎల్వీ సుబ్రమణ్యం పై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆయనపై కేసులున్నాయని, ఆయనను ఎలా సీఎస్ గా నియమించారని బాబు ప్రశ్నించారు. అయితే ఆ కేసులు అప్పటికే క్లియర్ అయి ఉండటంతో బాబు వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అయ్యాయి.అక్కడ నుంచి మొదలైంది వేడి. ఇటీవల చంద్రబాబు నాయుడు వివిధ శాఖల సమీక్షలు నిర్వహించడంపై సీఎస్ స్పందించారు. బాబుతో సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేసి ఆయన అగ్నికి ఆజ్యం పోశారు. దీంతో మళ్లీ బాబు సమీక్షలు అనే మాట ఎత్తకుండా చేశారు ఎల్వీ సుబ్రమణ్యం. డైరెక్టుగా అధికారులకే నోటీసులు ఇవ్వడంతో మళ్లీ అధికారులు ఎవరూ బాబుతో సమీక్షలకు హాజరు అయ్యే ధైర్యం చేయరు కదా!

ఇక అంతటితో కూడా ఆగలేదు సీఎస్. ఒక పత్రికతో ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. 'జూన్ ఎనిమిది వరకూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అనడానికి లేదు. ఒకవేళ ఎన్నికల్లో వారు గెలిస్తే వారే కొనసాగవచ్చు. అలా కాకుండా వైఎస్సార్సీపీ గెలిస్తే మే ఇరవై మూడునే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది..' అని ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. అందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమీ లేకపోయినప్పటికీ, 'జూన్ ఎనిమిది వరకూ అధికారం మాదే..'అంటున్న టీడీపీ వాళ్లకు ఆ మాటలు ఇబ్బందికరంగా మారాయి.

ఇవన్నీ పైకి కనిపిస్తున్నవి. ఇక సీఎస్ సమీక్షలు నిర్వహిస్తూ వివిధ శాఖల వ్యవహారాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇది బాబు కేబినెట్ మంత్రులకు ససేమేరా నచ్చడం లేదు. ఈ విషయంలో యనమల బహిరంగంగానే ఫైర్ అయ్యారు. మరోవైపు సమీక్షలు నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేసేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెల్లగక్కుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై దుమ్మెత్తి పోస్తూ, వైఎస్సార్సీపీ ఫిర్యాదులకు విలువని ఇస్తున్నారంటూ.. తనకు సమీక్షలు నిర్వహించే అధికారం ఇవ్వాలంటూ బాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే కోడ్ అమల్లో ఉందనే ఏకైక రీజన్ తో బాబు లేఖను సీఈసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఢిల్లీ పర్యటన ఆసక్తిదాయకంగా మారింది. కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలు, కట్టడాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ విచారణకు ఆయన ఢిల్లీ పర్యటన అంటున్నా, అక్కడ ఆయన కేంద్రంలోని పెద్దలను ఎవరినైనా కలవబోతున్నారా.. అనేది చర్చనీయాంశంగా, ఆసక్తిదాయకమైన అంశంగా మారింది. మొత్తానికి పలితాలు రాకుండానే..చంద్రబాబు వర్సెస్ సీఎస్ పోరాటం రసవత్తరంగా సాగుతోంది. ఫలితాలు వచ్చే వరకూ ఈ వ్యవహారం ఇంకా ఎలా సాగుతుందో!