Begin typing your search above and press return to search.

చంద్రబాబు వర్సెస్ ప్రశాంత్ కిశోర్

By:  Tupaki Desk   |   19 July 2017 5:15 AM GMT
చంద్రబాబు వర్సెస్ ప్రశాంత్ కిశోర్
X
ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాష్ఱ్టంలో తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ యాక్టివిటీ పెంచడంతో పాలక టీడీపీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అసలే నంద్యాల ఉప ఎన్నికల్లో సీను బ్యాడుగా ఉండడం... ఆపై ప్రశాంత్ కిశోర్ రాష్ర్టంలో తిష్ట వేయడంతో టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. చంద్రబాబును మరింత కంగారుపెట్టేలా ప్రశాంత్ కిశోర్ జనసేన అధినేత పవన్ ను కలిసి వైసీపీతో కలిసి పనిచేసే అంశంపై మాట్లాడేందుకు సిద్ధమవుతుండడంతో చంద్రబాబు కూడా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరీ ముఖ్యంగా పవన్ ను ప్రశాంత్ కిశోర్ కలవకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో ఓట్లను తిప్పి టిడిపి విజయానికి కారణమైన పవన్‌ కల్యాణ్‌ ను కలవాలని వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అపాయింట్‌ మెంట్‌ కూడా తీసుకున్నారు. అయితే... ఈ సంగతి తెలిసిన టీడీపీ లీడర్ షిప్ అంతకంటే వేగంగా పావులు కదిపింది. ప్రశాంత్‌ కిషోర్‌ పవన్‌ ను కలవకుండా తాత్కాలికంగానైనా ఆపేందుకు ప్లాను వేసింది. అందులో భాగంగా ఇమ్మీడియట్ గా చంద్రబాబు - పవన్ ల భేటీకి ఏర్పాట్లు చేసింది. నిజానికి చంద్రబాబును కలిసేందుకు పవన్‌ కల్యాణ్‌ అంతకుముందు అపాయింట్‌ మెంట్‌ కోరినా ఇవ్వలేదని సమాచారం. అలాంటిది ప్రశాంత్‌ కిషోర్‌ - పవన్‌ లు కలుస్తారని తెలియగానే చంద్రబాబు పవన్ కు కబురు పంపించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కారణంగా కీలకమైన కాపు ఓట్లు వైసీపీకి దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ప్రశాంత్‌ కిషోర్‌ ఎలాగైనా పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నంద్యాల ఉప ఎన్నికలో యువ ఓట్ల కోసం కూడా పవన్ ను వాడుకోవాలన్నది ప్రశాంత్ ప్లానుగా తెలుస్తోంది.

పవన్ ఎలాగూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. జగన్ దీ అదే అజెండా. కానీ... చంద్రబాబు - బీజేపీ ప్రత్యేక హోదా నుంచి పక్కకు పోయాయి. ఆ ఒక్క కారణంతో పవన్ ను టీడీపీ నుంచి దూరం చేసి వైసీపీకి చేరువ చేయాలన్నది ప్రశాంత్ వ్యూహంగా తెలుస్తోంది. ప్రధానంగా కాపు ఓట్ల కోసం రెడు పార్టీలూ పవన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ ను వాడుకుని ఆ తరువాత వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ఆయన కోసం ప్రయత్నిస్తుండడంతో మళ్లీ చంకనెక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.