Begin typing your search above and press return to search.

ఇద్దరిలో ఎవరి పంతం గెలుస్తుంది ?

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:05 AM GMT
ఇద్దరిలో ఎవరి పంతం గెలుస్తుంది ?
X
‘వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును గెలవనిచ్చేది లేదు’..మంత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం
‘వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తాం’..చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ.

మొత్తానికి పై రెండు నియోజకవర్గాల్లో ఒకళ్ళ ఓటమికి మరొకళ్ళు పెద్ద వ్యూహాలే పన్నుతున్నట్లు అర్ధమైపోతోంది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోను గెలిచేందుకు లేదని జగన్మోహన్ రెడ్డి గట్టిగా అనుకున్నారు. అనుకోవటమే కాదు ఆ బాధ్యతను పెద్దిరెడ్డి మీద ఉంచారు. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి కూడా పదే పదే కుప్పంలో పర్యటనలు చేస్తున్నారు.

చంద్రబాబును దెబ్బకొట్టడమే టార్గెట్ గా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలన్నీ కుప్పంలో పక్కాగా అమలు చేస్తున్నారు. బహుశా దీని ఫలితమేనేమో పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. అలాగే పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ స్వీప్ చేసేసింది. ఇక మిగిలింది తొందరలో జరగబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికలే. స్ధానిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన భారీ ఓటమితో చంద్రబాబు పరువు పోయిందనే చెప్పాలి.

కనీసం మున్సిపల్ ఎన్నికల్లో అయినా పార్టీని గెలిపించుకోవాలని చంద్రబాబు ఈమధ్యనే రెండు రోజుల టూర్ చేశారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూడాలి. ఇప్పటికైతే చంద్రబాబును దెబ్బకొట్టాలనే పెద్దిరెడ్డి వ్యూహం వర్కవుటవుతోందనే అనుకోవాలి. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీని చంద్రబాబు నిర్లక్ష్యం చేయటం కూడా పెద్దిరెడ్డికి బాగా కలిసొచ్చిందనే అనుకోవాలి. ఇక పుంగనూరు విషయం చూద్దాం. కుప్పంపై చంద్రబాబు పట్టుతో పోల్చితే పుంగనూరులో పెద్దిరెడ్డి పట్టు చాలా ఎక్కువ.

ఎందుకంటే ఓడినా, గెలిచినా పెద్దిరెడ్డి ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటారు. పైగా చంద్రబాబులా కాకుండా పెద్దిరెడ్డి జననేతగా పేరున్న వ్యక్తి. చంద్రబాబు ఎప్పుడు కూడా క్యాడర్ బేస్డ్ లీడర్ కాదు. పోనీ నేతల్లో అయినా పట్టుందా అంటే అదీలేదు. సీఎంగా ఉన్నపుడు మాత్రమే చంద్రబాబు మాట చెల్లుబాటవుతుంది. కానీ పెద్దిరెడ్డి అలాకాదు తాను గెలిచినా, ఓడినా తన మద్దతుదారుల కోసం గట్టిగా నిలబడతారు.

2019 ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దాదాపు 10 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి మద్దతుదారులే గెలిచారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించటం చంద్రబాబు ప్రతిజ్ఞ చేసినంత సులభంకాదు. ఎందుకంటే అసలు నియోజకవర్గంలోనే పెద్దిరెడ్డిని ఢీకొట్టేంత సీన్ ఉన్న నేత టీడీపీ లేరు. అదే కుప్పంలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన చంద్రమౌళి కొడుకు భరత్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రచారంలో ఉంది. పైగా ఇతనికి ఎంఎల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పెద్దిరెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తారని ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు ఎంఎల్ఏగా పోటీచేస్తారని పార్టీలో ప్రచారంలో ఉంది. ఏ రకంగా చూసినా చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరే అవకాశాలు తక్కువనే చెప్పాలి. సరే రాజకీయాలు ఎప్పుడు ఒకేతీరుగా ఉండవు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరి పంతం గెలుస్తుందో చూడాల్సిందే.