Begin typing your search above and press return to search.

ప్లీజ్ బాబు.. ఒలింపిక్స్ కామెడీ ఆపేయ‌వా?

By:  Tupaki Desk   |   25 July 2018 5:21 AM GMT
ప్లీజ్ బాబు.. ఒలింపిక్స్ కామెడీ ఆపేయ‌వా?
X
కోరిక‌ల‌కు సైతం హ‌ద్దులు ఉండాలి. నేల మీద న‌డ‌వ‌టానికి సైతం శ‌క్తి లేని వారు.. రాకెట్లో అంత‌రిక్షంలోకి వెళ్లి.. ప‌రుగులు తీయాల‌న్న ఆలోచ‌న‌ల్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు. థింక్ బిగ్ అన్న‌ది మంచి కాన్సెప్ట్ అయిన‌ప్ప‌టికీ.. అన్ని సంద‌ర్భాల్లో అది న‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది. మింగ మెతుకు లేదు కానీ.. మీసాల‌కు సంపెంగ నూనె అన్న చందంలో మురుగు కాల‌వ‌ల‌కు.. రోడ్లు వేయ‌టానికి.. నెల‌స‌రి జీతాలు ఇవ్వ‌టానికి సైతం నిధులు కొర‌త‌తో అల్లాడుతున్న ఏపీ స‌ర్కారు.. ఏకంగా ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ గురించి మాట్లాడ‌టం కామెడీ కాకుండా మ‌రేంటి?

నిజానికి.. ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ అన్న‌ది.. ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ కోసం బిడ్డింగ్ వేసే విష‌యంపై జాతీయ స్థాయిలో ఆస‌క్తి ఉండాలి. కానీ.. ఆట‌ల‌న్న వెంట‌నే చంద్ర‌బాబుకు ఒలింపిక్స్ గుర్తుకు వ‌స్తూ ఉంటుంది. ఏ క్రీడా కార్య‌క్ర‌మానికి వెళ్లినా స‌రే.. త‌న ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ క‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఉంటారు చంద్ర‌బాబు.

త‌న స్థాయికి త‌గ్గ మాట‌ల్ని మాట్లాడాల్సిన ఆయ‌న‌.. ఒలింపిక్స్ మీద ఆయ‌న చేసే ప్ర‌తి కామెంట్ కామెడీగా మార‌ట‌మే కాదు.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు తీవ్ర‌స్థాయిలో కామెడీ చేసుకుంటూఉంటారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీకి అవ‌స‌ర‌మైన విష‌యాల్ని వ‌దిలేసి.. ఒలింపిక్స్ వేదిక గురించి మాట్లాడ‌టంలో అర్థం లేని ప‌ని. ఇప్ప‌టికే డిసైడ్ అయిన రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన నిధులు లేక ప‌నులు జ‌ర‌గ‌ని ప‌రిస్థితి. అలాంటి వేళ‌.. ఒలింపిక్ క‌ల‌ను ఆవిష్క‌రిచ‌టం ఎబ్బెట్టుగా ఉంటుంది. క్రీడ‌ల మీద చంద్ర‌బాబుకు నిజంగా అంత ప్రేమే ఉంద‌ని అనుకుంటే.. రానున్న ఒలింపిక్స్ కోసం ఏపీ త‌ర‌ఫున ప‌లువురు క్రీడాకారుల్ని తయారు చేస్తున్నామ‌న్న ప్ర‌క‌ట‌న‌ను ఇవ్వాలి.

అందుకు త‌గ్గ‌ట్లు త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్ని వివ‌రించాలి. అంత దాకా ఎందుకు.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఏపీ వార్షిక బ‌డ్జెట్ల‌లో క్రీడ‌ల‌కు కేటాయించిన బ‌డ్జెట్ ఎంత‌న్న‌ది చూస్తే.. బాబు మాట‌లు అర్థం లేనివ‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.ఇవాల్టి ప‌రిస్థితుల్లో ఒలింపిక్స్ కు వేదిక అవ్వాలంటే త‌క్కువ‌లో త‌క్కువ రూ.1.5ల‌క్ష‌ల కోట్ల నిధులు అవుస‌ర‌వుతాయి. ఏపీ లాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. అవినీతి ఉన్న చోట అయితే.. ఏకంగా రూ.3ల‌క్ష‌ల కోట్ల నిధులు కూడా స‌రిపోవు. నిజానికి మ‌న‌కంత సీన్ ఉందా చంద్ర‌బాబు? ఒలింపిక్స్ ఏపీ వేదిక కావాల‌న్న క‌ల‌లకు ముందు ఒలింపిక్స్ లో కొన్ని ప‌త‌కాలు సాధించే స‌త్తా ఉన్న క్రీడాకారుల్ని సిద్ధం చేయ‌టంపై బాబు స‌ర్కారు దృష్టి సారిస్తే మంచిది.